ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు శిశు సంక్షేమ సఖ మంత్రి పరిటాల సునీత. అంతేకాదు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడీ పైన ఆవిడ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో జగన్ చేస్తున్నా పాదయాత్రపై సునీత విమర్శలు చేశారు. గురువారం మీడియా ఎదుట మాట్లాడిన ఆమె ప్రతిపక్షంపై పలు వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ జగన్ పాదయాత్రకే పరిమితం…ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్షాలు చెడుగా ప్రచారం చేస్తున్నాయని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంతోమంది మహిళల పసుపు కుంకుమలు తుడిచేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేము చంద్రన్న పసుపు-కుంకుమ పేరుతో మహిళలకు సాయం చేస్తున్నాం అన్నారు.
రాయలసీమలో అభివృద్ధి జరగలేదంటూ ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ హయాంలో రాయలసీమలో అభివృద్ధి జరిగిందా అంటూ ప్రశ్నించారు. నందమూరి తారక రామారావు శంకుస్థాపన చేసిన హంద్రీనీవాను వైఎస్ ఎందుకు పూర్తి చేయలేదు అని ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక హంద్రీనీవాను ద్వారా నీళ్లు ఇస్తున్నామని, అందుకే సీమ మొత్తం పంటలతో కళకళలాడుతోంది అని మంత్రి సునీత వెల్లడించారు.
కాగా మంత్రి సునీత జగన్, వైఎస్సార్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. వైసిపి శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్సార్ మహిళల పసుపు కుంకుమలు తుడిచేశారు అంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు మండి పడుతున్నారు. జగన్ పాదయాత్రకు పరిమితం కాదు 2019 ఏపీ సీఎం అంటూ ఎదురు దాడికి దిగారు వైసిపి అభిమానులు.