వార్ వన్ సైడ్… ఉత్తరాంధ్రలో ఎగిరే జెండా లెక్కలివే!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఏపీలో ప్రధాన పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాల్లో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ ఒకపక్క అభ్యర్థుల జాబితాపై తీవ్ర కసరత్తులు చేస్తూ.. భారీ ఎత్తున మార్పులు చేర్పులు చేస్తూ సరికొత్త రాజకీయానికి తెరలేపింది. మరోపక్క “సిద్ధం” అంటూ ఎన్నికల శంఖారం పూరించింది. ఇదే సమయంలో “రా.. కదలిరా” అంటూ సభలతో హోరెత్తించిన చంద్రబాబు.. ప్రస్తుతం చిన్న విరామం తీసుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు షురూ చేశారని చెబుతున్నారు.

ఇక ఇప్పటికే రాష్ట్ర పర్యటన అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ పార్టీ పరిస్థితిపై ఒక అంచానాకోసం అంటూ.. ఆయా జిల్లాల్లో సభలు పెట్టి.. తాను చేయబోయే రాజకీయంపై సుస్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇదే క్రమంలో ఈ నెల 4వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల శంఖారావం పురించబోతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు.

అయితే… ఈ ప్రధాన పార్టీలన్నీ ప్రధానంగా దృష్టి ఉత్తరాంధ్ర పైనే పెట్టడం గమనార్హం. షర్మిళ తన రాష్ట్ర పర్యటనను, జగన్ తన “సిద్ధం” సభను, త్వరలో పవన్ కల్యాణ్ తన ఈ ఎన్నికల తొలి ప్రచార సభను ఉత్తరాంధ్ర నుంచే ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. కారణం… గత కొన్ని ఎన్నికల నుంచి చూస్తే.. ఉత్తరాంధ్ర ప్రజలు ఇవ్వడం మొదలుపెడితే గంతగుప్పగా ఇస్తున్నారు. తమకు నచ్చిన పార్టీకి మూడొంతుల సీట్లు కట్టబెడుతున్నారు.

2004 నుంచి చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2004లో వైఎస్సార్ పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో మొత్తం 37 సీట్లకు గానూ కాంగ్రెస్‌ కు 21 సీట్లు కట్టబెట్టారు ఉత్తరాంధ్ర ప్రజానికం. ఇందులో భాగంగా… ఇందులో భాగంగా… శ్రీకాకుళం – 7, విజయనగరం – 6, విశాఖ – 8 సీట్లు అందించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 12 సీట్లు.. ఇతరులకు 4 సీట్లు కట్టబెట్టారు.

ఇక వైఎస్సార్ రెండోసారి బరిలోకి దిగిన 2009 ఎన్నికల విషయానికొస్తే… మొత్తం 34 స్థానాల్లోనూ కాంగ్రెస్ కు 23 స్థానాలు కట్టబెట్టారు ఉత్తరాంధ్ర ప్రజానికం. ఇందులో భాగంగా… శ్రీకాకుళం – 9, విజయనగరం – 7, విశాఖపట్నం – 7 స్థానాల్లో గెలుపొందించారు. ఇక మిగిలిన స్థానాల్లో టీడీపీకి 7, ప్రజారాజ్యానికి 4 స్థానాలు అందించారు.

ఇక రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లోనూ వారు పట్టంకట్టాలనుకున్న పార్టీకి వన్ సైడ్ మెజారిటీ ఇచ్చినట్లుగా స్పందించారు. ఇందులో భాగంగా… ఆ ఎన్నికల్లో టీడీపీకి 24 స్థానాలు కట్టబెట్టారు. ఇందులో భాగంగా… శ్రీకాకుళం – 7, విజయనగరం – 6, విశాఖపట్నం – 11 స్థానాల్లో టీడీపీని గెలిపించారు. ఇక మిగిలిన స్థానాల్లో 9 వైసీపీకి ఇవ్వగా, 1 స్థానంలో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ గెలిచింది.

ఈ క్రమంలో 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే… వైసీపీకి అత్యధికంగా 28 స్థానాలు అప్పగించిన ఉత్తరాంధ్ర ప్రజానికం… టీడీపీకి కేవలం 6 స్థానాలే పరిమితం చేశారు. ఇలా ఉత్తరాంధ్ర ప్రజానికం ప్రతీ ఎన్నికల్లో వీలైనంతవరకూ స్పష్టమైన మెజారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో… రాబోయే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ-జనసేన కూటమిలలో ఎవరికి స్పష్టమైన మెజార్టీ ఇవ్వబోతున్నారనేది వేచి చూడాలి!!