అనంతపురం ఎంపి జేసి దివాకర్ రెడ్డికి చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారట. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే జెసినే చేయాలని లేకపోతే వేరొకరికి టిక్కెట్టు కేటాయిస్తానని జెసికే స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన కొడుకు జెసి పవన్ రెడ్డికి అనంతపురం ఎంపిగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని జెసి ఎప్పటి నుండో కోరుతున్నారు. తాను రాజకీయాల నుండి రిటైర్ అవుతున్నట్లు చెప్పిన జేసి తన స్ధానంలో కొడుకు పవన్ రెడ్డి పోటీ చేస్తారని తనంతట తానుగా ప్రకటించేశారు.
కొడుకు అభ్యర్ధిత్వంపై జెసి ఏకపక్షంగా చేసిన ప్రకటనపై అప్పట్లో చంద్రబాబు మండిపడ్డారు. తర్వాత చంద్రబాబు, జేసి మధ్య భేటీలో కొడుకు పోటీపై చంద్రబాబు ఆమోదం తీసుకున్నట్లు సమాచారం. దాంతో అందరూ అనంతపురం టిడిపి ఎంపి టిక్కెట్టు జేసి పవన్ కే అనుకున్నారు. అయితే, అనూహ్యంగా పరిస్ధితులు మారిపోయినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పవన పై చంద్రబాబుకు పార్టీ నేతల నుండే విపరీతమైన ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఎంఎల్ఏలు, నియోజకవర్గ ఇన్చార్జిలు కూడా పవన్ కు వ్యతిరేకంగా చంద్రబాబుకు ఫీడ్ బ్యాక్ ఇచ్చారట.
పార్టీలోని ఎంఎల్ఏలు, నేతలతో పవన్ కు సరైన సఖ్యత లేదని, ఎవరిని కూడా కలుపుకునిపోయే మనస్తత్వం లేదని ఫిర్యాదులు అందినాయట. నియోజకవర్గంలో ఎప్పుడు పర్యటించినా ఎంఎల్ఏలను, నేతలను డామినేట్ చేసే మనస్తత్వంతోనే పవన్ వ్యవహరిస్తున్నారట. పవన్ మనస్తత్వాన్ని దగ్గర నుండి చూసిన తర్వాత ఎంఎల్ఏలు, నేతలు కూడా జేసి కొడుకుతో కలవటానికి ఇష్టపడటం లేదని సమాచారం. పైగా పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తాను చెప్పిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని దివాకర్ రెడ్డి పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఎంఎల్ఏలకు జెసికి ఏమాత్రం పడటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్లే కొడుకు వ్యవహారం కూడా నడుస్తోందని నేతలు మండిపడుతున్నారట.
పవన్ వ్యవహారశైలి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఇపుడున్న ఎంఎల్ఏల్లో ఎవరికీ టిక్కెట్లు దక్కవని చెప్పకనే చెబుతున్నట్లుందని అందరూ అనుమానిస్తున్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా పవన్ కు వ్యతిరేకంగా ఎంఎల్ఏలు, నేతలు ఏకమవుతున్నారు. పవన్ అభ్యర్ధి అయితే పార్టీ గెలవదని కూడా స్పష్టంగా చంద్రబాబుకు చెప్పారట. దాంతో చంద్రబాబు పునరాలోచించి ఎంపితో ఇదే విషయాన్ని చెప్పారని పార్టీ వర్గాలంటున్నాయి. పోటీ చేస్తే జేసి దివాకర్ రెడ్డే చేయాలని లేకపోతే వేరే నేతకు టిక్కెట్టిచ్చి పోటీ చేయిస్తానని చంద్రబాబు చెప్పేశారట. చంద్రబాబు నిర్ణయంతో జెసి ఏమి చేస్తారో ? పవన్ ఏం నిర్ణయం తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది.