రోడ్డు మీదనే మరదలిని చంపిన బావ

రోడ్డుకు అడ్డంగా సామాన్లు కడుగుతొందన్న కోపంతో మరదలిని కర్రతో కొట్టి హత్య చేశాడో బావ. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన విషాద సంఘటన ఇది. అసలు వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…

తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం శాంతిమూల గ్రామంలో పోటినాటి నాగమణి ఆమె ముగ్గురు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నది. పెద్ద కుమారుడు సుబ్రమణ్యం, రెండో కుమారుడు శ్రీనివాస్ లు ఒక ఇంట్లో ఉంటుండగా మూడో కుమారుడు సత్యనారాయణ, మాధవి దంపతులు పక్కనే గుడిసెలో ఉంటున్నారు.

మాధవి బుధవారం రాత్రి ఇంటి ముందు రోడ్డు పై సామాన్లు తోముతుండగా శ్రీనివాస్ మద్యం సేవించి అక్కడ నుంచి వస్తున్నాడు. అప్పడు మాధవి రోడ్డు మీద సామాన్లు పెట్టడంతో రోడ్డుకు అడ్డంగా పెడితే ఎలా వెళ్లాలని ప్రశ్నించి ఆమె పై కోపడ్డాడు. దీంతో వీరిద్దరికి గొడవయ్యింది. మత్తులో ఉన్న శ్రీనివాస్ పక్కనే ఉన్న కర్రను తీసుకొని మాధవి తల, ఛాతిపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావమైన మాధవి అక్కడికక్కడే చనిపోయింది. 

ఇంట్లో ఉన్న మాధవి భర్త బయటికి వచ్చి చూసేసరికే మాధవి ప్రాణాలు కోల్పోయింది. మాధవికి కొడుకు, బిడ్డ ఉన్నారు. శ్రీనివాస్ మద్యానికి బానిస కావడంతో ఆయన భార్య 15 సంవత్సరాల క్రితమే పుట్టింటికి వెళ్లి పోయింది. అప్పటి నుంచి శ్రీనివాస్ తల్లితో నే ఉంటూ సోదరులు పెట్టింది తింటున్నాడని, అతనికి మతిస్థిమితం కూడా సరిగా లేదని స్థానికులు తెలిపారు.

మాధవి చనిపోవడంతో పిల్లలు ఏం తెలియక బిక్కుబిక్కుమంటూ కూర్చున్న విధానం చూసి అంతా చలించారు. పెద్దకుమారుడి భార్య కువైట్‌లో ఉండడం, రెండో కుమారుడు భార్య వదిలి వెళ్లిపోవడం, మూడో కుమారుడు భార్య మృత్యువాత పడడంతో వారికిగల చిన్నారుల బాధ్యత నానమ్మ నాగమణిపై పడింది. వీళ్లందరినీ ఎలా సాకాలి అంటూ… నాగమణి బోరున విలపించింది.