Y.S Sharmila: ఇటీవల పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించిన విషయం పెద్ద ఎత్తున సంచలనగా మారింది. ఈయన మరణం రాజకీయాల పరంగా కూడా తీవ్ర దుమారం రేపుతుంది. ప్రవీణ్ పగడాల అనుమానాస్పదంగా రోడ్డు పక్కన పడి ఉండటంతో ఆయన ప్రమాదవశాత్తు మరణించారని అందరూ భావించారు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ద్విచక్ర వాహనం పై వస్తున్నటువంటి ఈయన మార్గమధ్యమంలో అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయారు. ఇక ఎవరూ కూడా ఈ ప్రమాదాన్ని గమనించలేదని మరుసటి రోజు ఉదయం చూసేసరికి ప్రవీణ్ చనిపోయి ఉన్నారని పోలీసులు కూడా తెలిపారు.
ఇలా బైక్ పై వస్తున్నటువంటి ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణించారని భావిస్తున్నప్పటికీ ఆయన శరీరంపై ఉన్న గాయాలు చూస్తే మాత్రం ఆయనది సహజ మరణం కాదని ఎవరో పథకం ప్రకారమే తనని చంపేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై ఆయన కుటుంబ సభ్యులు అలాగే పాస్టర్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ చేసి ప్రవీణ్ మరణానికి గల కారణాలు తెలపాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇక పాస్టర్ ప్రవీణ్ మరణం పై ఇప్పటికే ప్రభుత్వం కూడా సీరియస్గా విచారణ జరుపుతోంది అయితే తాజాగా వైఎస్ షర్మిల ప్రవీణ్ మరణం పై స్పందించారు. ఈ సందర్భంగా షర్మిల సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ… పాస్టర్ ప్రవీణ్ మరణం సహజ మరణం కాదని ఆయనని పథకం ప్రకారమే హత్య చేశారనడానికి సంఘటన స్థలంలో ఎన్నో రుజువులు ఉన్నాయని తెలిపారు.
ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యే అని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ఈమె తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.