ఉత్తర ప్రదేశ్ లో దారుణం.. గర్భవతి మీద సామూహిక హత్యాచారం..!

ప్రస్తుత కాలంలో మహిళలకు రక్షణ కరువైపోయింది. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు చిన్న పిల్లలు, ముసలి వారు అని చూడకుండా తమ కామ వాంఛలు తీర్చుకోవటానికి కొంతమంది మగాళ్లు మృగాలుగా మారి మహిళల మీద దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. గర్భవతి అని కనికరం కూడా లేకుండా వారి సుఖం కోసం ఒక మహిళ పై సామూహిక హత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే… మంగళవారం రోజు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వయంగా బాధితురాలు తనపై హత్యాచారం జరిగినట్టు పోలీసులకు వెల్లడించింది. ఆగష్టు 16 వ తేదీన బరేలీ జిల్లా నుంచి బస్సులో బయలుదేరి సహరాన్‌పూర్‌కు వెళ్తుండగా ఫరూఖాబాద్‌లోని బస్ టెర్మినల్ నుంచి నలుగురు యువకులు తనను కిడ్నాప్ చేసి ఓ చోటుకు తీసుకెళ్లారని బాధితురాలి పోలీసులకి వెల్లడించింది. ఆ నలుగురు వ్యక్తులు మూడు రోజుల పాటు తనను అక్కడే బంధించారని, తాను రెండునెలల గర్భవతిని అని ఎంత మొత్తుకున్నా వారు కనికరం చూపకుండా దారుణంగా నాపై సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేసింది. శుక్రవారం నాడు వారి నిద్రిస్తున్న సమయంలో అక్కడి నుండి తప్పించుకున్నానని ఆమె పోలీసులకు వెల్లడించింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ సంఘటనకు పాల్పడిన నిందితులను పట్టుకోవటానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి . ఈ క్రమంలో తనపై సామూహిక హత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించి ఆమె చెప్పిన విషయం నిజమా? కాదా? అన్నది తెలుసుకోనున్నారు. ఉత్తరప్రదేశ్ లో తరచు ఇటువంటి దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. నిందితులకు కఠిన శిక్ష విధించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.