పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు మాత్రమే కేటాయించడంతో ఆ పార్టీ నేతలు, జనసైనికులు ఎక్కడికక్కడ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ కోసం ఎకరాలు అమ్ముకున్నామని ఒకరంటే.. కోట్లు ఖర్చుపెట్టామని ఇంకొకరు వాపోతున్నారు. మరికొంతమంది ఆఫ్ ద రికార్డ్ పవన్ కు శాపనార్థాలు పెడుతున్నారు. ఇంత తక్కువ సీట్లకే ఒప్పుకోవడంపై కాపు నేతలు మండిపడుతున్నారు. ఎంతకు అమ్ముడయ్యావంటూ నిప్పులు కక్కుతున్నారనీ తెలుస్తుంది.
ఇదే సమయంలో ఇది ఏమత్రం గౌరవప్రదమైన పొత్తు కాదని.. డిమాండ్ చేసి మరీ కావాల్సిన సీట్లు తీసుకోవాల్సిన చోట సన్నాయి నొక్కులు నొక్కడం ఏమిటని ఫైరవుతున్నారు. ఈ ప్రకంకపనలు ప్రధానంగా టీడీపీ – జనసేన కూటమి ఎన్నో ఆశలు పెట్టుకున్న గోదావరి జిల్లాల్లో బలంగా వినిపిస్తుండటం గమనార్హం. శనివారం రాత్రి మొదలైన ఈ తిట్ల పంచాంగాలు ఇప్పటివరకూ ఆగకపోవడం గమనార్హం.
దీంతో ఈసారి టీడీపీ – జనసేన కూటమిని కాపులే మట్టికరిపించి వారి బలం ఏమిటో అటు బాబుకి, ఇటు పవన్ కి ఒకేసారి చూపిస్తారనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఇంతకాలం రకరకాల మాయ మాటలు చెప్పి జనసైనికులను ఏమార్చిన పవన్.. కాసేపు సీఎం అని, మనల్ని ఎవడ్రా ఆపేది అని, గౌరవ ప్రదమైన సీట్లు అంటూ… జనసేన నేతలను, కార్యకర్తలను బురిడీ కొట్టించిన డ్యూటీని.. ఇప్పుడు కొణతాల రామకృష్ణ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది!
అలా పార్టీలోకి వచ్చారో లేదొ ఇలా ఎమ్మెల్యే టిక్కెట్ పట్టేసిన కొణతాల రామకృష్ణ… జనసేనకు కేటాయించిన సీట్లపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు! ఇందులో భాగంగా పొత్తులో భాగంగా జనసేనకు మరో పది సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు! బీజేపీ కోసం కొన్ని సీట్లు ఆపారని.. బీజేపీ కలవని పక్షంలో ఆ సీట్లు జనసేనకే ఇస్తారు అని ఆయన కొత్త మాట చెప్పుకొచ్చారు. దీంతో జనసైనికులు కొణతాలపై నిప్పులు కక్కుతున్నారని తెలుస్తుంది.
జనసేనకు మరో పది సీట్లు ఇవ్వడం అనేది వాస్తవానికి జరిగే పనేనా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. ఎందుకంటే… బీజేపీకి ఇచ్చే టికెట్లు అంటే అవేమీ ఎగస్ట్రాగా ఉండవు.. అవి కూడా టీడీపీ నుంచే ఇవ్వాలి. ఇప్పటికే ఇరవై నాలుగు సీట్లు కోత పడిందని ఆ పార్టీ నేతలు నానా యాగీ చేస్తున్నారు. దానికి కొత్తగా మరిన్ని ఇస్తే కనుక ఇక టీడీపీలో జరిగే రచ్చను అదుపుచేయడం చంద్రబాబు వల్ల కాదు కదా.. ఎవరివల్లా కాదు! దీంతో వాస్తవం గ్రహించిన జనసైనికులు కొణతాల మాటలపై ఫైరవుతున్నారు.
నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే టిక్కెట్ పట్టేసిన మీకేమి తెలుస్తుంది నొప్పి అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో… ఇంతకాలం తమకు మాయమాటలు చెప్పి పవన్ బురిడీ కొట్టిస్తే… ఇప్పుడు ఆ డ్యూటీ తమరు తీసుకున్నారా అంటూ నిలదీస్తున్నారు. సంవత్సరాల తరబడి పార్టీకి సేవ చేస్తూ.. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ.. ఎంతో ఆశతో ఎన్నో వ్యయ ప్రయాసలను ఓర్చిన తమ కష్టం విలువ నీకేం తెలుసంటూ డోసుపెంచుతున్నారు.