తెలంగాణ రాష్ట్ర సమితిని ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తరిస్తారా కేసీయార్.?

2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెరవెనుకాల సంపూర్ణ సహాయ సహకారాలు అందించింది తెలంగాణ రాష్ట్ర సమితి. చంద్రబాబుని రాజకీయంగా సమాధి చేయాలన్న ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ వేసిన వ్యూహాత్మక ఎత్తుగడ అది. అందుకు ప్రతిఫలంగా గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ, తెరవెనుకాల పూర్తి సాయం టీఆర్ఎస్‌కి అందించింది.

ఇక, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తన పార్టీని విస్తరింపజేయాలనుకుంటున్నారట. ఏపీ అలాగే మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి తమ మీద ఒత్తిడి పెరుగుతోందన్నది కేసీయార్ ఉవాచ.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష ఎన్నికల్లో షరామామూలుగానే ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీయార్, ఆ ఆనందంలో గులాబీ పార్టీ విస్తరణ గురించి సెలవిచ్చారు. నిజానికి ఇది పాత మాటే. తెలంగాణలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందనీ, అందుకే తమ పార్టీని ఇతర రాష్ట్రాల్లోనూ కోరుకుంటున్నారని కేసీయార్ ఊదరగొట్టేయడం ఇదే కొత్త కాదు.

మహారాష్ట్ర, కర్నాటక సంగతి పక్కన పెడితే, వీలు చిక్కినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ మీద కేసీయార్ విరుచుకుపడుతుంటారు. ‘ఆంధ్రోళ్ళతో పంచాయితీ అయిపోలేదు..’ అంటారు, ‘ఆంధ్రోళ్ళ బిర్యానీ పేడలా వుంటుంది..’ అని చెబుతారు. ఆయనిష్టం.. ఆయనేదైనా మాట్లాడగలరు.

అసలు కేసీయార్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోరుకుంటున్నదెవరు.? ఆ మధ్య విశాఖలో కేసీయార్ ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు వెలిశాయంటే, అది వైసీపీ పుణ్యమే. అంతేగానీ, ఏపీలో కేసీయార్ పార్టీకి ఓట్లు పడేంత సీన్ అయితే లేదు. అది తెలియనంత అమాయకుడైతే కాదు కేసీయార్. కానీ, ఆయనలా మాట్లాడతారంతే.. అది ఆయనిష్టం.