అనంతపురం జిల్లాలో కదిరి సిఐ గోరంట్ల మాధవ్ గత కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారారు. ఆయన తన పదవికి రాజీనామా చేసి త్వరలో రాజకీయ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన రాజకీయ రంగప్రవేశం వైసీపీలోకి అని తెలుస్తోంది. ఇటు వైసీపీ కూడా ఆయనకు స్వాగతం పలుకుతోన్నట్టు పార్టీ అంతర్గత సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాకు సర్వం సిద్ధం అయినట్టు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవండి.
అనంతపురంలో వైసీపీ శ్రేణులకు జేసీ ఫ్యామిలీపై పీకల్లోతు వ్యతిరేకత ఉంది. దీనికి కారణం ఆయన తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను అమర్యాదగా మాట్లాడటమే. ఆయన జగన్ ను అమర్యాదగా సంబోదించి వయసులో చిన్నవాడని, మా కులం వాడని లేదా జగన్ నా కొడుకు లాంటోడని చెబుతూ ఉండటాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేనా ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వైఎస్ హయాంలో పని చేసి రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరడం కూడా వైసీపీకి రుచించని విషయం.
ఆయన్ని కట్టడి చేయడానికి వైసీపీ అనేకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా వినాయక చవితి సందర్భంగా తాడిపత్రిలో ప్రబోధానంద స్వామి వర్గీయులకు, జేసీ వర్గీయులకు మధ్య వార్ జరిగింది. ఆ సమయంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారు. పోలీసులు కూడా జేసీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో కదిరి సిఐ గోరంట్ల మాధవ్ మీసం తిప్పి నాలుక తెగ్గోస్తా పోలీసులను చులకనగా మాట్లాడితే, మాది రాయలసీమే, మాకు కూడా పౌరుషం ఉంది అంటూ జేసీపై విరుచుకుపడ్డారు.
ఇలా ఫైర్ అయిన సిఐ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యారు. ఇక జేసీకి ఇంత స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన మాధవ్ పార్టీలో ఉండటం వలన ఆయన సామజిక వర్గీయుల(కురుబ) సపోర్ట్, పోలీసు వర్గాల సపోర్ట్ పార్టీకి ప్లస్ అవుతుందని భావించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఆయనను హిందూపూర్ పార్లమెంటు అభ్యర్థిగా బరిలో దింపేందుకు పావులు కదిపింది. అందుకు ఆయన కూడా సముచితంగా ఉండటం విశేషం. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రాకపోవడంతో అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సందర్భంలో ఆయన శుక్రవారం రాత్రి డీఎస్పీని కలవడం సంచలనంగా మారింది.
రాజకీయ ప్రవేశానికి ముందు ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తన రాజీనామా లేఖను సమర్పించేందుకు శుక్రవారం రాత్రి డిఎస్పీ శ్రీలక్ష్మిని కలిసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా ఆయన ఈరోజు లేదా రేపు రాజీనామా విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అనంతరం ఆయన వైసీపీలో చేరుతారని రాజకీయవర్గాల సమాచారం.