వై.ఎస్.ఆర్.సి.పి అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ జనసేన అధినేత, కాపుల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాపు సమాజం తీవ్రంగా పరిగణిస్తున్నది. గర్హిస్తున్నది. అసభ్య పదజాలంతో పవన్ వైవాహిక జీవితంపై వ్యాఖ్యలు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి, వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతోపాటు పవన్ కళ్యాణ్‌ను క్షమార్పణ కోరనట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కాపు సమాజం హెచ్చరిస్తున్నది. రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం యావత్తు ముక్త కంఠంతో జగన్ వ్యాఖ్యలను ఖండించాలి. క్షమార్పణ చెప్పే వరకు జగన్ పాదయాత్రను అడుగడుగున అడ్డుకుని నిరసన తెలియజేయాలని కాపులకు మనవి చేస్తున్నాం.
అక్రమాస్తులకు సంబంధించి అనేక కేసులలో ఎ-1 ముద్దాయిగా ఉండి 16 నెలలకు పైగా జైలుశిక్ష అనుభవించి బెయిల్‌పై బయటకొచ్చిన జగన్‌కు విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. నీతి నిజాయితీకి మారు పేరైన పవన్‌కళ్యాణ్‌కు, జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని మనవి చేస్తున్నాం. పవన్ గురించి మాట్లాడే అర్హత కూడా జగన్‌కు లేదు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆయనకే చెల్లింది. జగన్ అసెంబ్లీని వదిలి పారిపోయారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలలో నిజముంది. దానికి సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన విధానం కాదు. రాజకీయ పార్టీలన్న తర్వాత సిద్ధాంత పరంగా, విధానపరంగా విమర్శలు చేసుకోవడం సహజమే. కానీ బంద్ విజయవంతం కాలేదన్న నిస్పృహలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి పవన్‌పై నోటికొచ్చినట్లు అవాకులు చవాకులు పేలడం ఆశ్చర్యంగా ఉంది. రోజు రోజుకు పవన్ కళ్యాణ్‌కు ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగజారారు. అవినీతికి మారుపేరైన జగన్ జైలు చరిత్ర అందరికీ తెలిసిందే. దాంతో పాటు ఆయన రాసలీలల గురించి మేం నోరు విప్పితే, ఆయనకు మాకు తేడా ఉండదు కాబట్టి ఆ విషయాల జోలికి వెళ్లడం లేదు.
శాసనసభలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ తన విద్యుక్త ధర్మాన్ని మరిచారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజాసమస్యలపై, విభజన హక్కులను సాధించుకోవడంపై ప్రభుత్వాన్ని నిలదీయకుండా పాదయాత్ర పేరుతో బాధ్యత నుంచి తప్పించుకోవడం నిజం కాదా? కేసుల భయంతో ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించే దమ్ము లేక తన పార్టీ ఎంపీల చేత కూడా రాజీనామా చేయించడం నిజం కాదా? ప్రజలు చీ కొడతారన్న భయంతోనే ఏకపక్షంగా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి నిజం కాదా? కాపు రిజర్వేషన్లపై జగన్ ఇప్పటివరకు విస్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. మా నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఆందోళన చేసినన్ని రోజులు రాజకీయంగా ఉపయోగించుకున్నారు. పార్టీ పరంగా ఇంతవరకు వైఖరి వెల్లడించలేదు. పైగా కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలను ఓర్వ లేకపోతున్నారు. అందుకే నీచమైన వ్యాఖ్యలు చేసి తన అసలు బుద్ధి పెట్టుకున్నారు.
ఇట్లు : లింగంశెట్టి ఈశ్వరరావు, మాజీ ఎంఎల్‌ఎ, ఏపీసీసీ కాపు సెల్ చైర్మన్.
