వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు లాగేస్తానన్న జనసేనాని.! ఎందుకీ ప్రగల్భాలు.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ, వైసీపీ తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేసేశారు. విపక్షం కదా, జనసేన పార్టీ ఎలాగూ అధికార పార్టీ మీద విమర్శలు చేస్తుంటుంది. ఇందులో వింతేమీ లేదు. కాకపోతే, తన స్థాయిని మర్చిపోయి జనసేనాని విమర్శలు చేస్తుంటారు.. అదే అసలు సమస్య. పోనీ, అదీ రాజకీయాల్లో మామూలేనని అనుకోవచ్చుగాక.

వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కిందికి లాగేస్తామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా నినదించేశారు. కానీ, ఎలా.? ఈ ప్రశ్నకు సమాధానం జనసేనాని వద్ద వుండాలి కదా.! అసలంటూ ఆ సమాధానం ఆయన దగ్గర వుంటే, ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతారు.? నో డౌట్, పవన్ కళ్యాణ్‌కి బోల్డంత ఫాలోయింగ్ వుంది. సినిమా ఫాలోయింగ్ వేరు, రాజకీయ ఫాలోయింగ్ వేరు.. అన్నది నిర్వివాదాంశం. అయితే, ఆ సినిమా ఫాలోయింగ్‌ని, రాజకీయ ఫాలోయింగ్‌గా మార్చుకోవడంలో జనసేన అధినేత విఫలమవుతున్నారు. అదే ఆయనకు పెద్ద సమస్య.

2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చాలా మాటలు చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో వైఎస్ జగన్‌ని కూర్చోనివ్వనంటూ ప్రగల్భాలు పలికేశారు. ఇప్పుడేమో, ఆ పదవిలో కూర్చున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కిందికి లాగేస్తానంటున్నారు. నవ్విపోదురుగాక పవన్ కళ్యాణ్‌కేంటి.? అనుకోవాల్సి వస్తుంది ఇలాంటి సందర్భాల్లో. జనసైనికులు సైతం, పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా వుంటే మంచిదన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. ప్చ్.. జనసేనాని, కార్యకర్తల మనోభావాలైనా గుర్తించకపోతే ఎలా.?