జగన్ సర్కారుకి ‘సుప్రీం’ ఊరట.! చంద్రబాబుకి జైలు తప్పదా.?

అమరావతి భూముల కుంభకోణం సహా, చంద్రబాబు హయాంలో అవకతవకలకు సంబంధించి వైఎస్ జగన్ సర్కారు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ ఏర్పాటు, విచారణ వ్యవహారాలపై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు విధించిన ‘స్టే’పై వైఎస్ జగన్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.

తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసులో వైఎస్ జగన్ సర్కారుకి ఊరటనిచ్చింది. హైకోర్టు ఇచ్చిన ‘స్టే’ని ఎత్తివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక దశలోనే ‘స్టే’ ఇవ్వడం సబబు కాదని, ఈ సిట్ ఏర్పాటు విధాన పరమైన నిర్ణయాలకు సంబంధించింది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

సుప్రీం తీర్పుతో, చంద్రబాబు హయాంలో జరిగిన అనేక అవకతవకలపై వైఎస్ జగన్ సర్కారు విచారణ జరిపి, చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. ప్రధానంగా అమరావతి కుంభకోణాన్ని బట్టబయలు చేయడం ఈ సిట్ ఉద్దేశ్యం. అదే సమయంలో, పలు ప్రాజెక్టులకు సంబంధించి చంద్రబాబు హయాంలో అవకతవకలు జరిగాయని వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

సాధారణంగా ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి ఈ తరహా ‘సిట్’ ఏర్పాటు దాదాపు ఎక్కడా జరిగిన దాఖలాల్లేవన్నది టీడీపీ ఆరోపణ. అవకతవకలు జరగలేన్నదప్పుడు, ‘సిట్’ వంటి విచారణ సంస్థలకు భయపడాల్సిన అవసరమేముంది.? ఇదిలా వుంటే, చంద్రబాబు అండ్ కో ఇకపై జైలుకు వెళ్ళడం ఖాయమని వైసీపీ నేతలు అంటున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో.!