ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వరుసగా సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో వైరి వైఖరికి స్వస్తిచెప్పిన జగన్ సర్కారు , ప్రస్తుత పంచాయితీ ఎన్నికలకు తోడు మున్సిపల్ పోరుకూ సమ్మతించగా, ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇప్పటికే రెండు దశల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడు, నాలుగు విడతల నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఈ నెల 21 నాటికి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు మార్చి 10న పోలింగ్ జరుగనుంది.
ఏపీలో గతేడాది మార్చిలోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రహాసం మొదలైనప్పటికీ, కరోనా కారణంగా ప్రక్రియ అర్థాంతరంగా నిలిచిపోయింది. ఆ తర్వాత ఎస్ఈసీ నిమ్మగడ్డతో సర్కారు విభేదాల కారణంగా వాయిదా పడుతూ, చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో గత నెలలో ప్రక్రియ పున: ప్రారంభం అయింది. అయితే, గతేడాది అన్నిటికంటే ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రారంభం కాగా, ఈసారి మాత్రం పంచాయితీ ఎన్నికల్ని ముందుగా చేపట్టారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా గతంలోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన దరిమిలా వాటిని కూడా ఆగిన చోట నుంచే పున:ప్రారంభించాలని నిమ్మగడ్డ యోచిస్తున్నారని, అందుకు సర్కారు కూడా అంగీకరించిందని సమాచారం.
పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల కంటే కూడా జెడ్జీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణ ఎస్ఈసీ నిమ్మగడ్డకు అసలైన సవాలుగా నిలవనుంది. ఎందుకంటే, గతేడాది ఈ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలు, అధికార వైసీపీ అక్రమాలకు పాల్పడిందనడానికి ఆధారాలను స్వయంగా నిమ్మగడ్డే.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరి, తానే అక్రమాలు జరిగాయని పేర్కొన్న ఎన్నికలను మళ్లీ ఆయనే ఎలా కొనసాగిస్తారు? అనేది ఒక ప్రశ్నయితే, ఇప్పటికే ఎస్ఈసీ తీరుపై గుర్రుగా ఉన్న టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు న్యాయపోరాటానికి దిగే అవకాశాలు కూడా లేకపోలేవు. ఒక వేళ ప్రక్రియను మళ్లీ మొదటి నుంచీ మొదలు పెడితే, అందుకు జగన్ సర్కారు ఒప్పుకోకపోవచ్చు.
ప్రస్తుత పంచాయితీ ఎన్నిలకుతోడు మార్చి 10న పోలింగ్ జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు కూడా జగన్ సర్కారు సమ్మతించడం, అలాగే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం పొడగింపుపైనా చర్చ జరుగుతోంది. నిజానికి ఈ ఏడాది మార్చి 31తో నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తవుతుంది. ఒకవేళ మంగళవారం లేదా త్వరలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే గనుక ఆయన పదవిలో ఉండగా ప్రక్రియ పూర్తికాదు. కాబట్టి ఎక్స్‌టెన్షన్ తప్పనిసరి.