నాదెండ్ల..చంద్రబాబు కోవర్టా ? వర్మ ట్వీట్లతో సంచలనం

కొన్ని ముద్రలంతే జీవితాంతం వెంటాడుతునే ఉంటాయి. అటువంటి ముద్రల్లో వెన్నుపోటు ముద్ర చాలా బలమైంది. ఇదంతా ఎందుకంటే, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ పై వెన్నుపోటు ఆరోపణలు చేశారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను హెచ్చరికలు చేసే క్రమంలో చంద్రబాబునాయుడు తరపున వెన్నుపోటు పొడవటానికి నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరినట్లు తనకు కచ్చితమైన సమాచారం ఉందంటూ చేసిన ట్వీట్లు సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెన్నుపోటు పదం బాగా పాపులరైంది మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కరరావు విషయంలోనే.

 

1983లో టిడిపి వ్యవస్ధాపక అద్యక్షుడు ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఏడాదికే పదవిలోనుండి దింపేశారు. దానికి కారణం నాదెండ్ల భాస్కరరావే. ఎన్టీయార్ తర్వాత అంతటి కీలక హోదాలో ఉన్న నాదెండ్ల ఎన్టీయార్ వెన్నంటి ఉంటూనే పదవిలో నుండి దింపేశారు. సరే ఆ తర్వాత ఏం జరిగిందన్నది అప్రస్తుతం అనుకోండి. అయితే, అప్పటి నుండే నాదెండ్లకు వెన్నుపోటుదారుడు అనే బలమైన ముద్ర పడిపోయింది. ఘటన జరిగి ముప్పై ఏళ్ళైపోయినా నాదెండ్ల అంటే ఇప్పటికీ వెన్నుపోటే గుర్తుకొస్తుంది. అలాంటిది వర్మ తన ట్వీట్లలో తాజాగా నాదెండ్ల వెన్నుపోటును ప్రస్తావించటం గమనార్హం.

 

ఎన్టీయార్ కు నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినట్లే పవన్ కు కొడుకు వెన్నుపోటు పొడుస్తారంటూ నాదెండ్ల మనోహర్ పై పెద్ద బండే పడేశారు. నిజానికి సంవత్సరాల కాంగ్రెస్ అనుభవంలో మనోహర్ నుండి ఎవరికీ వెన్నుపోటు అనుభవం ఎదురుకాలేదు. ఎందుకంటే, మనోహర్ ఎవరికీ హానీ చేయలేడు, ఎవరికీ ఉపయోగపడడు. పార్టీలో రాహూల్ గాంధి లేకపోతే సోనియా స్ధాయిలో పరిచయాలున్నాయి  కాబట్టి తెనాలి వరకూ టిక్కెట్టు తెచ్చుకోగలుగుతున్నారు. పార్టీ గాలుంటే గెలిచారు లేకపోతే ఓడిపోయారంతే. నియోజకవర్గంలో పెద్ద వర్గాన్ని మెయినటైన్ చేయటం, బలప్రదర్శన చేయటం లాంటివి మనోహర్ చేయలేరు.

 

అలాంటి మనోహర్ పై వర్మ దృష్టి ఎందుకు పడిందో తెలీదు. మొత్తానికి చంద్రబాబునాయుడు తరపునే మనోహర్ జనసేనలో చేరారంటూ వర్మ ట్వీట్లలో వరుసగా ఆరోపణలు చేయటం వైరల్ గా మారింది. అసలే మనోహర్ కు పవన్ ఇస్తున్న ప్రాధాన్యతతో జనసేనలో చాలామందికి మండిపోతోంది. మనోహర్ ను పార్టీలో నుండి ఎలా బయటకు పంపాలా అని ప్లాన్లు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటువంటి సమయంలోనే వర్మ చేసిన ట్వీట్లు మనోహర్ వ్యతిరేక వర్గానికి వరంగా మారుతుందా లేకపోతే మనోహర్ మరింతగా బలపడతాడో చూడాల్సిందే.