ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోలీసు డిపార్ట్మెంట్‌లో ఖాళీలు ఎక్కువగా ఉన్న ఉన్న నేపథ్యంలో ఆ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కొద్ది నెలలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయటానికి నోటిఫికేషన్ రిలీజ్ కోసం ఏపీ డీజీపీ ప్రభుత్వాన్ని అనుమతి కూడా కోరారు. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలీస్ రీక్రూమెంట్ నోటిఫికేషన్ అక్టోబర్ 20వ తేదీన విడుదల చేశారు. 2023 సంవత్సరం జనవరి 22న కానిస్టేబుల్ అభ్యర్థులకు, ఫిబ్రవరి 19వ తేదీన సబ్ ఇన్‌స్పెక్టర్ అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు.
పోలీస్ అవ్వాలన్న తమ కల నెరవేర్చుకోవడం కోసం ఇంత కాలం ఎదురు చూసిన అభ్యర్థులు.. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయటంతో అభ్యర్థులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 6,100 కానిస్టేబుల్ పోస్టులు, 411 ఎస్పై పోస్టుల భర్తీ కి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే నోటిఫికేషన్ విడుదల చేయటంతో ఆనందం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు కొందరైతే ,వయోపరిమితి తక్కువ ఉండటం వల్ల ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవటానికి వీలులేక మరికొంత మంది అభ్యర్థులు బాధ పడుతున్నారు.
ఈ క్రమంలో నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కలిసి ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గల వయో పరిమితి పెంచాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. వీరి అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రెండేళ్లపాటు వయోపరిమితి పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అభ్యర్థులందరూ ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 2023 జూన్‌లో పోలీసు శిక్షణ ప్రారంభించి 2024 ఫిబ్రవరి ప్రారంభం నాటికి పోలీసు శాఖలో పోస్టింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం.