ఈ ఫొటోలో కనిపిస్తున్నది లైన్‌మెన్ అనుకుంటే పొరపాటు పడినట్టే. ఆయన స్వయాన సబ్ ఇన్‌స్పెక్టర్. పేరు ప్రియతమ్ రెడ్డి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. ఆళ్లగడ్డ ప్రధాన రహదారిపై నాలుగు రోడ్ల సెంటర్‌లో విద్యుత్ స్తంభాన్ని ఎక్కిన ఓ వ్యక్తిని కిందికి దింపటానికి ఎవరూ చేయని సాహసం చేశారాయన. క్రేన్ తెప్పించుకుని తానూ విద్యుత్ స్తంభాన్ని ఎక్కారు. నచ్చచెప్పి ఆ వ్యక్తిని కిందికి తీసుకొచ్చారు.
స్థానిక అధికారులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ సమస్యను పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఫలితం లేదని ఆగ్రహిస్తూ ఆ వ్యక్తి విద్యుత్ స్తంభాన్ని ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలిసిన ప్రియతమ్ రెడ్డి సంఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే కిందికి దిగాలని, స్థానిక అధికారులతో మాట్లాడి తాను సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అయినప్పటికీ.. అతను వినిపించుకోలేదు. దీనితో ప్రియతమ్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. క్రేన్‌ను తెప్పించుకున్నారు. దాని కొక్కేనికి బెల్ట్ అమర్చి, దానిపై కూర్చుని విద్యుత్ స్తంభంపైకి చేరుకున్నారు. ఆ వ్యక్తికి నచ్చచెప్పి, తనతో పాటు కిందికి తీసుకొచ్చారు. ప్రియతమ్ రెడ్డి తీసుకున్న చొరవను స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఆ వ్యక్తిని రక్షించడానికి ప్రియతమ్ రెడ్డి తీసుకున్న చొరవను స్థానికులు ప్రశంసిస్తున్నారు.