తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఫిజికల్ టెస్టుకు తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్లు ఇవే

పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామకాలలో భాగంగా ఫిజికల్ ఈవెంట్ టెస్టులకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 11 నుంచి ఫిజికల్ ఈవెంట్స్ ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అన్ని జిల్లా కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఎస్పీ పర్యవేక్షణలో ఈ పరీక్షలను చేపట్టనున్నారు. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8 వ తేది వరకు ఈవెంట్స్ జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్ధులకు సంబంధించిన వివరాలు, వారు తీసుకురావల్సిన సర్టిఫికెట్లకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో పొందుపరిచామని అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో చాలా స్టిక్ట్ గా ఈవెంట్స్ జరగనున్నాయని అధికారులు ప్రకటించారు.

కానిస్టేబుల్ నియమాకాలలో ఎటువంటి పైరవీలు జరుగవని అధికారులు స్పష్టం చేశారు. ఫిట్ నెస్ టెస్టులకు హాజరయ్యే అభ్యర్దులు పూర్తిగా తమ స్వంత శక్తిని నమ్ముకోవాలని అన్నారు టెస్టులకు హాజరయ్యే అభ్యర్దులు విలువైన వస్తువులు, ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, అధిక మొత్తంలో డబ్బు, లగేజి వంటివి తెచ్చుకోవద్దని సూచించారు. టెస్టులు నిర్వహించే గ్రౌండ్ లను పోలీసు అధికారులు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై అభ్యర్దులకు కలిపి ఒకే సారి ఈవెంట్స్ ను నిర్వహించనున్నారు.   

అభ్యర్దులు తమ వెంట తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్లు ఇవే

* అభ్యర్థి సంతకంతో కూడిన పార్ట్-2 ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం అడ్మిట్ కార్డు, ఇంటిమేషన్ లెటర్
* స్వయంగా ధ్రువీకరించకున్న కమ్యూనిటీ సర్టిఫికెట్ కాపీ
* త్రివిధ దళాలలో పనిచేసిన మాజీ సైనికులు, వ్యక్తి గతంగా ధృవీకరిం చుకున్న నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కాపీ
* ఏజెన్సి ఏరియాకు చెందిన అభ్యర్థులు వ్యక్తిగతంగా ధృవీకరించుకున్న ఏజెన్సి ఏరియా తెలంగాణ ప్రభుత్వం ధృవీకరణ పత్రం.
* దేహదారుఢ్య పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమకు కేటాయించిన రోజు ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యన స్టేడియం గ్రౌండ్‌లో ఖచ్చితంగా హాజరుకావలసి ఉంటుంది. ఆలస్యమైన వారికి అనుమతి ఉండదు. 
* అభ్యర్థులు తమకు కేటాయించిన తేదిలలో మాత్రమే దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావలసి ఉంటుంది.