తొందరలో రాష్ట్రంలోని మూడు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ మూడు స్ధానాలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఖాళీ అయ్యాయి. అంటే అప్పటికే ఎంఎల్సీలుగా ఉన్న వైసిపి, టిడిపి నేతలు ఎంఎల్ఏలుగా ఎన్నిక కావటంతో తమ పదవులకు రాజీనామాలు చేయటంతో మూడు ఎంఎల్సీ స్ధానాలు ఖాళీ అయ్యాయి.
వైసిపి తరపున ఆళ్ళ నాని, కోలగట్ల వీరభద్రస్వామితో పాటు టిడిపి తరపున కరణం బలరామ్ ఎంఎల్ఏలుగా ఎన్నికైన విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఆ మూడు స్ధానాలు ఖాళీ అయ్యాయో వాటిని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది గురువారం. దాంతో ఒక్కసారిగా నేతల్లో హడావుడి మొదలైంది.
ఖాళీ అయిన మూడు స్ధానాలను వైసిపి వన్ సైడ్ గానే గెలుచుకుంటుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఎంఎల్ఏల కోటాలో భర్తీ అవ్వబోయే ఖాళీల్లో టిడిపికి ఒక్క సీటు కూడా దక్కదు. ఒక్కో ఎంల్సీకి 44 మంది ఎంఎల్ఏలు ఓట్లు వేయాల్సుంటుంది. ఈ లెక్కన టిడిపి గెలిచిందే ఒక్క సీటు కూడా అసలు పోటీ చేయటానికి కూడా అవకాశం లేదు.
ఇక పార్టీకి దక్కబోయే మూడు స్ధానాల్లో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో జగన్ నిర్ణయానికి వచ్చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఎంఎల్ఏగా ఓడిపోయినా మంత్రివర్గంలో చేరిన మోపిదేవి వెంకటరమణకు ఒక స్ధానం ఖాయం. మిగిలిన రెండు స్ధానాల్లో హిందుపురం ఎంఎల్ఏగా ఓడిపోయిన మొహ్మద్ ఇక్బాల్, అసలు పోటీ అవకాశమే రాని మర్రి రాజశేఖర్ కు ఒక సీటు ఖాయమట. ఇక మూడోది ప్రకాశం జిల్లాలోని చీరాలలో పోటి చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ లేదా పోటికి దూరంగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లో ఒకరికి ఖాయమని పార్టీ వర్గాల సమాచారం.