Revanth Reddy: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం రోజురోజుకు చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు.
ఇలా దాదాపు పదిమందికి పైగా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన నేపథ్యంలో ఇలా పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే కచ్చితంగా ఆ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయి ఇలా ఉప ఎన్నికలు వస్తే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి డామేజ్ జరిగే అవకాశాలే ఉన్నాయి.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి స్పందిస్తూ..రాష్ట్రంలో ఎలాంటి ఉప ఎన్నికలు రాబోవని స్పష్టం చేస్తూ, ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.ప్రతిరోజూ ఉప ఎన్నికల గురించి ప్రజల్లో భయాందోళన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. “2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఏ సంప్రదాయం అమలులో ఉందో, అదే విధానాన్ని మేము కొనసాగిస్తున్నాం.
గతంలో బీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఏకంగా మంత్రి పదవులు కూడా ఇచ్చారు.కానీ మేము ఎవరికి కూడా పదవులు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ చేసిన తప్పులను మాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.ఫిరాయింపుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ అంశంపై అనవసర ఊహాగానాలు, అసత్య ప్రచారాలు అవసరం లేదు. తెలంగాణలో ఎలాంటి ఉప ఎన్నికలు జరగవనీ భరోసా కల్పించారు.