ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నిక అన్ని పార్టీలకి చావో రేవో లాగ ఉండబోతుంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పాల్సిందే ! అధినేత చంద్ర బాబుకి ఇప్పుడు పార్టీని గెలిపించి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంది.విజయం కోసం ఏ విధంగా ముందుకు సాగాలి?ఏమేం చెయ్యాలి అనే విషయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు ఈ ఉప ఎన్నిక ప్రాణ సంకటంగా పరిణమించింది. గత ఏడాది ఎన్నికలు పూర్తయి ఏడాదిన్నర అయింది. ఈ సమయంలో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత గురించి ఆలోచించడం కన్నా.. కూడా చంద్రబాబు టీడీపీ పుంజుకుందా? లేదా ? అనే కోణంలోనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే.. ఈ ఏడాదిన్నర సమయంలో ఆయన అనేక కార్యక్రమాలు చేశారు. అదే సమయంలో తాను తీసుకువచ్చిన అన్నా క్యాంటీన్లు.. వంటి కీలక పథకాలను జగన్ నిలుపుదల చేశారు. ఇక, తన పని అయిపోయిందని అనుకున్న సమయంలో మళ్లీ ప్రజల మధ్యకు వచ్చారు. అమరావతిని ప్రధానంగా నిలుపుకొనేందుకు ప్రయత్నాలు చేశారు. జోలె పట్టారు. రైతులకు అండగా అనేక రూపాల్లో అందరినీ ఏకతాటిపైకి నిలిపారు. పార్టీలోనూ అసంతృప్తులను తగ్గించారు. కోరిన వారికి చాలా పదవులు ఇచ్చారు.
ఇక, అటు అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చేస్తున్నారు. మరి ఇన్ని చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలనే గట్టి పట్టుదల ఉంది. దీంతో ఆయన నేతలను ఇప్పటి నుంచే అలెర్ట్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఎంపీలను కూడా రంగంలోకి దింపి.. ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇక ఇటీవల పార్టీలో ఏర్పాటు చేసిన జెంబో కమిటీల్లో ఉన్న నాయకులు అందరికి తిరుపతి ఉప ఎన్నిక కోసం ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగించేశారు.
ఇక, డిజిటల్ ప్రచార బాధ్యత పూర్తిగా మళ్లీ లోకేష్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రధాన రాజకీయ ప్రచారం అంతా కూడా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగనుంది. ఇలా వ్యూహాత్మకంగా చంద్రబాబు వేస్తున్న అడుగులు ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి. ఇక తిరుపతి ఉప ఎన్నిక కోసం చంద్రబాబు ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే.