కాకమీదున్నప్పుడే ఏపీలో ఎంటరవ్వనున్న కేసీఆర్!

రాష్ట్రస్థాయి రాజకీయాలనుంచి జాతీయస్థ్హాయిలో చక్రాలు తిప్పాలని భావించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆరెస్స్) కాస్తా… భారత్ రాష్ట్ర సమితి (బీఆరెస్స్) గా మారిన సందర్భంగా… ఏపీలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు కేసీఆర్! ఈ క్రమ్మలో… తోట చంద్రశేఖర్ ను బీఆరెస్స్ ఏపీ అధ్యక్షుడిని చేసేశారు. అయితే… మొదట్లో ఇది లైట్ అనుకున్నా… రోజు రోజుకీ ఏపీపై కూడా కేసీఆర్ ఫోకస్ పెరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు!

అవును… ఏపీలో బీఆరెస్స్ కాన్సంట్రేషన్ రోజు రోజుకీ పెరుగుతుందని అంటున్నారు. ఈ సమయంలో బీఆరెస్స్ కు చాలా బాగా ఉపయోగపడబోతుంది… విశాఖ స్టీల్! ఏపీలో ఏ రాజకీయపార్టీ కూడా పూర్తిగా శ్రద్ధ పెట్టకపోవడం.. భారీస్థాయిలో ధర్నాలూ దీక్షలూ జరగకపోవడం.. ఒక వర్గం మీడియాకు మోడీ అంటే భయభక్తులు ఉండటంతో… విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వ్యవహారం పెద్దగా ఫోకస్ అవ్వడం లేదుకానీ… అది చాలా పెద్ద సమస్యే!

అయితే.. ఎలాగూ బీజేపీతో కొట్లడుతున్నారు కాబట్టి.. పైగా ఏపీలో విశాఖ స్టీల్ చాలా సెంటిమెంట్ వ్యవహారం కాబట్టి… ఆ సమస్యనే ఎత్తుకుని, ఏపీలో ఎంటరవ్వాలని కేసీఆర్ ఫిక్సయ్యారంట. ఇందులో భాగంగా… బీఆరెస్స్ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ విశాఖకు తొందరలో రాబోతున్నారు అని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆరెస్స్.. విశాఖలో భారీ సభను ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో కేటీఆర్ పత్రికా ముఖంగా స్పందించిన సంగతి తెలిసిందే.

కేసీఆర్ పూర్వీకులది విజయనగరం జిల్లా బొబ్బిలి కావడంతోనో ఏమో కానీ… మొదటి నుంచి ఉత్తరాంధ్రా జిల్లాల మీదనే కేసీఆర్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. తనకు ఉత్తరాంధ్రతో బ్లడ్ రిలేషన్ ఉందని చెప్పుకోవడంవల్ల ఆ ప్రాంతంలో బీఆరెస్స్ కి రాజకీయ పట్టు దొరుకుతుందని ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపధ్యంలో ఈ నెల 8న ఏపీ బీఆరెస్స్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విశాఖ రానున్నారు. ఆయన స్టీల్ ప్లాంట్ కార్మికులతో ఉద్యమకారులతో భేటీ అవుతారని తెలుస్తోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలను పూర్తిగా తెలుసుకుని.. ఆయన అధినాయకత్వానికి నివేదిస్తారని అంటున్నారు. సాధ్యమైంత త్వరలో విశాఖలో స్టీల్ ప్లాంట్ వ్యతిరేక సభను నిర్వహించడం ద్వారా.. ఏపీలో తమ రాజకీయ భూమికను స్థిరపరచుకోవాలని కేసీఆర్ ప్లాన్ గా ఉందని అంటున్నారు. కాగా… జనసేన తరఫున 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసిన పార్ధసారధి బీఆరెస్స్ లో ఇప్పటికే చేరారు. ఇదే క్రమంలో… తోట చంద్రశేఖర్ కు మిత్రుడు అయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద బీఆరెస్స్ తీసుకున్న ఉద్యమ కార్యాచరణను స్వాగతించారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో… వాతావరణం కాకమీదున్నప్పుడే రంగంలోకి దిగాలని ఫిక్సయిన కేసీఆర్… వీలైనంత తొందర్లో… విశాఖలో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారన్నమాట!