ఇప్పుడు అటు ఏపీ రాజకీయాల్లోనూ.. ప్రధానంగా టీడీపీ శ్రేణుల్లోనూ బలంగా నడుస్తున్న చర్చ.. బీజేపీతో టీడీపీ పొత్తు! వాస్తవానికి 2014 లో ఉన్న స్థాయిలో మోడీ మేనియా ఏపీలో ఉందంటే అంగీకరించేవారు అతి స్వల్పం! మరి వెంటపడి వెంటపడి మరీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు చెబుతున్న పరిస్థితితుల్లో ఆ పొత్తు అవసరమా..? అంటే… సమాధానం “కాదు” అనే విషయం చంద్రబాబుకి మాత్రం తెలియదా అని అంటున్నారు పరిశీలకులు.
వివరాళ్లోకి వెళ్తే… చంద్రబాబుని రాజకీయ చాణిక్యుడిగా అభివర్ణిస్తుంటారు. అధికారంకోసం ఆయన చేసే ప్రయత్నాలు, వేసే ఎత్తులు చాలా మంది ఊహకు అందవని అంటుంటారు. అయితే… అది గతం!! ఇప్పుడు బాబు వేస్తున్న ఎత్తులు, చేస్తున్న వ్యూహాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, అందుకు కారణమైన పరిస్థితులు అన్నీ అందరికీ తెలిసిపోతున్నాయని.. అయినా కూడా తప్పక చేయాల్సిన పరిస్థితి బాబుదని అంటున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల లెక్కల ప్రకారం ఏపీలో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 0.8 కాగా… సుమారు 6శాతం జనసేనది. ఈ రెండూ కలిపితే దాదాపు 7 శాతం మాత్రమే. అయితే… వీరితో పొత్తు వల్ల క్రీస్టియన్, ముస్లిం మైనారిటీ ఓట్లు పూర్తిగా కూటమికి, ప్రధానంగా టీడీపీకి దూరమవుతాయనేది అంతా బలంగా చెబుతున్న మాట. పైగా ఏపీలో మైనారిటీ ఓటు బ్యాంకు సుమారు 9 – 10 శాతం! ఆ మాత్రం విషయం బాబుకి తెలియదా?
7శాతం ఓట్లు లేని జనసేన – బీజేపీలను కలుపుకోవడం ద్వారా 9 – 10 శాతం ఉన్న మైనారిటీ ఓట్లను బాబు దూరం చేసుకోవడం వెనుక అతిపెద్ద కారణాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. బీజేపీతో పొత్తు పెట్టుకోనప్పటికీ ఎస్సీ, ఎస్టీ, క్రీస్టియన్, ముస్లిం మైనారిటీ ఓట్లు గంతగుప్పగా వైసీపీకి పడతాయనే చర్చ ఏపీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తుంది. ఈ సమయంలో పొరపాటున జరగకూడనిది ఏమైనా జరిగితే… ఇదే చంద్రబాబు మదిలోని బెంగ అని అంటున్నారు.
కేవలం ఆ ఒక్క కారణమే బీజేపీతో పొత్తుకు పురిగొల్పిందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వెల్ అండ్ గుడ్. బీజేపీ – జనసేన అవసరం లేకుండానే టీడీపీ ఇండివిడ్యువల్ గా మేజిక్ ఫిగర్ సంపాదిస్తే… మరీ గుడ్డు! ఒక వేళ జగన్ తిరిగి అధికారంలోకి వస్తే…! ఇదే ఇప్పుడు చంద్రబాబు ముందున్న అతిపెద్ద టెన్షన్!! ఆ సమయంలో కేంద్రంలో మోడీ అధికారంలోకి వస్తే కనీసం వారి సపోర్ట్ ఉంటుందనేది ఆయన నమ్మకం అని చెబుతున్నారు.
ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఐడీ చంద్రబాబుపై పలు కేసులు నమోదు చేసింది. ఇందులో కేవలం ఒక్క స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులోనే 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పరిస్థితి. ఈ సమయంలో జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి అన్నింటినీ పూర్తిస్థాయిలో లైన్ లో పెడితే… అప్పుడు 0.8శాతం ఓట్ల కోసం 9 – 10 శాతం ఓట్లను ఎందుకు వదులుకున్నదీ తమ్ముళ్లకు అర్ధమవుందనేది బాబు ఆలోచనగా చెబుతున్నారు!!
ఆ మాత్రం ముందు చూపు లేకుండానే 9 – 10శాతం ఉన్న మైనారిటీ ఓట్లను కాలదన్నుకుని మరీ బీజేపీతో జతకట్టలేదు చంద్రబాబు అని అంటున్నారు పరిశీలకులు. దీంతో… తమ్ముళ్లు ఫీలవుతున్నంతగా చంద్రబాబు అంత అమాయకుడేమీ కాదని స్పష్టం చేస్తున్నారు!!