పాత చింతకాయ… జగన్ నెత్తిన పాలు పోస్తున్న బాబు!

రోజులు మారాయి.. తదనుగుణంగా రాజకీయాలూ మారాయి.. ప్రధానంగా రాజకీయాలపై ప్రజల అభిప్రాయాలు మారుతున్నాయి! పాతచింతకాయ తరహా వ్యూహాలు, ఎత్తులూ రాజకీయాల్లో పని చేయనట్లే… ప్రజలకు ఏమి మేలు చేస్తామో చెప్పకుండా ప్రత్యర్థులపై విమర్శలు మాత్రమే చేస్తాము అనే తరహా నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి కూడా దాదాపు లేదనే కామెంట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ సమయంలో గతకొంతకాలంగా చంద్రబాబు చేస్తున్న రాజకీయ ప్రసంగాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ఎలాగైనా గద్దె దించాలని టీడీపీ, జనసేన కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. “వారాహి యాత్ర”, “రా.. కదలిరా”, “యువగళం”, “జెండా” ల పేర్లతో బహిరంగ సభలు నిర్వహిస్తూ భారీగా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు, పవన్, లోకేష్! ఇలా పెద్ద ఎత్తున జనాల్లో ఉండటం శుభపరిణామమే అయినా… ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించిన చేస్తున్న ప్రసంగాలు మరింత ముఖ్యమనే విషయం బాబు & కో పూర్తిగా మర్చిపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన కీలక సభలో చంద్రబాబు, పవన్ ల ప్రసంగాలు అత్యంత పేలవంగా సాగాయనే చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తుంది. అంతక ముందు, ఆ తర్వాత కూడా ప్రధానంగా చంద్రబాబు ప్రసంగాలు ఆ విధంగానే ఉంటున్నాయనే అతిపెద్ద ఫిర్యాదు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది. ఇదే కంటిన్యూ అయితే… జగన్ నెత్తిన చంద్రబాబు తెలిసి తెలిసి పాలు పోసినట్లే అని అంటున్నారు.

తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ఎలాంటి అభివృద్ధి చేశాను.. ప్రధానంగా 2014 – 2019 వరకూ తన పాలనలో కనబరిచిన అద్భుతాలనే కంటిన్యూ చేస్తాను అని చెప్పాల్సిన చంద్రబాబు.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరడం వంటి విషయాలపైనే ప్రధానంగా ప్రసంగిస్తున్నారు. ఇలా ఎంతసేపూ జగన్ పై వ్యక్తిగత విమర్శలు మాత్రమే చేయడం వల్ల జనాల విషయంలో ఈ ప్రసంగాలు తేలిపోతున్నాయి.

చంద్రబాబు వచ్చి… వైఎస్ వివేకాని చంపింది ఎవరు తమ్ముళ్లూ? అని ప్రశ్నించడంపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారని అంటున్నారు తమ్ముళ్లు. ఆ విషయం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది!! ఇక… తల్లికీ, చెల్లికీ న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తారని పవన్ ప్రసంగిస్తున్నారు. ప్రజలకు అవసరం లేని లాజిక్ ఇదనేది జనసైనికుల అభిప్రాయంగా ఉంది! మరోపక్క… మైకందుకున్న లోకేష్… సైకో జగన్ అని అంటారు. దీనివల్ల ఎవరికి ఉపయోగమే చినబాబే చెప్పాలి.

తాము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం.. అది చేస్తాం.. అన్నవిధానంలో మాగ్జిమం ప్రసంగాలు ఉండాలి.. అప్పుడప్పుడూ జగన్ సర్కార్ పై విమర్శలు చేయాలి.. అప్పుడే ప్రజల్లోకి ఈ ప్రసంగాలు వెళ్తాయనే విషయం పవన్, లోకేష్ లు గ్రహించకపోయినా పర్లేదు కానీ… చంద్రబాబు వంటి సీనియర్ కి అది మస్ట్ అండ్ షుడ్! కారణం… పవన్, లోకేష్ చెప్పే విషయాలకంటే చంద్రబాబు చెప్పే విషయాలే ముఖ్యం!!

మరోపక్క ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం మైకందుకున్న ప్రతీసారి… మీ ఇంటికీ మంచి జ‌రిగి ఉంటేనే ఓట్లు వేయండి అని ప్రజలను కోరుతున్నారు. ఇది క్లిస్టర్ క్లియర్ పాలిటిక్స్ అని చెప్పుకోవాలి! మరోపక్క ఈ నెల 10న ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేయబోతున్నారు. దీంతో… ఈసారి జగన్ ఎలాంటి హామీలిస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.

జగన్ రాజకీయం అలా నడుస్తుంటే… చంద్రబాబు ప్రజలకు ఏమి కావాలనే విషయాలకంటే ఎక్కువగా… జగన్ పై వ్యక్తిగత విమర్శలకే పరిమితమవుతున్నారని అంటున్నారు. జగన్ పై తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేయడం టీడీపీ శ్రేణులకు నచ్చొచ్చు కానీ… సామాన్య ప్రజానికానికి ఏమాత్రం అవసరం లేదు! ఈ విషయాలను చంద్రబాబు & కో పరిగణలోకి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.. అలా కానిపక్షంలో జరిగేది జరగక మానదు!!