2019 సార్వత్రిక ఎన్నికల ఓటమితోనే చంద్రబాబు నాయుడుగారి ఛరీష్మా మసకబారింది. ఓట్లేసిన ఓటర్లు సైతం తెలుగుదేశం ఈ రీతిలో మట్టికరుస్తుందని అనుకోలేదు. కేవలం 23 సీట్లతో సరిపెట్టుకునేసరికి అందరూ ఎంత ఘోరం జరిగిపోయిందని ముక్కున వేలేసుకున్నారు. జరిగిన ఈ డ్యామేజీకి రిపేర్లు చేసుకునే పనిలో ఉన్నారు చంద్రబాబుగారు. ఆంధ్రాలో ఈ స్థాయిలో పార్టీ దెబ్బతినడంలో చంద్రబాబుగారిదే పూర్తి తప్పిదం అనేలేం. కాలం కూడ ఆయనకు కలిసి రాలేదని అనుకోవాలి. కానీ పక్క రాష్ట్రం తెలంగాణలో పార్టీ భూస్థాపితం కావడానికి మాత్రం ఆయనే కారణమని మొహమాటం లేకుండా చెప్పొచ్చు. రాష్ట్రం విడిపోవడంతో పార్టీ పునాదులు కదిలిపోయిన మాట వాస్తవమే. కానీ మరీ కనుమరుగయ్యేంత అయితే కాదు. కాచుకుని ఉంటే నిలబెట్టుకుని ఉండవచ్చు.
కానీ చంద్రబాబుగారు కాచుకోలేదు. ఆయన చేసిన పొరపాట్లు పార్టీ మీద పిడుగుల్లా పడి బూడిద చేసేశాయి. ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసీఆర్ చంద్రబాబు మీద సీత కన్ను వేశారు. టీడీపీకి ఆంధ్రోళ్ల పార్టీ అని పేరు పెట్టేసి గెంటేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఫలించి టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన చాలా చోట్ల చిత్తుగా ఓడింది. వరుసపెట్టి పెద్ద లీడర్లు పార్టీని వీడటంతో మరింత కుంగిపోయింది. అయితే ఏ కోశానా చంద్రబాబు పార్టీని నిలబెట్టగలననే నమ్మకాన్ని నాయకులకు ఇవ్వలేదు. పోయేవాళ్లను పోనియ్యండని వదిలేశారు. 2016 గ్రేటర్ ఎన్నికలను నిర్లక్ష్యం చేసి ఒకే ఒక్క సీటుకు పరిమితమయ్యారు. దానికంటే ఘోరంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చిరకాల శత్రువు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి పాతాళానికి పడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు కూడ వారికి ఓట్లు వేయలేదని తేలింది.
ఆ కలయిక టీడీపీ, కాంగ్రెస్ రెండు పార్టీలను దెబ్బతీసి తెరాసను 2014 ఎన్నికలంటే ఎక్కువ సీట్లు తెచ్చుకునేలా చేసింది. అసలు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని పార్టీ పనుల నిమిత్తం హైదరాబాద్లో ఉండే అవకాశాన్నే కోల్పోయారు ఆయన. ఇక ముగిసిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీకి దిగి మరొక పెద్ద తప్పు చేశారు. ఆ ఎన్నికల్లో పోటీ తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నడుమ మాత్రమే ఉంటుందని అందరికీ తెలుసు. అయినా కూడ బాబుగారు పంతానికి పోయి పోటీకి దిగారు. అవతల వైసీపీకి కూడ తెలంగాణలో ఎంతో కొంత కేడర్ ఉంది. కానీ జగన్ తొందరపడలేదు. ఎలాగూ జరిగే పని కాదని తెలిసి ఎన్నికల ఊసే ఎత్తలేదు. పోటీచేసేది లేదని కేడర్ కు క్లారిటీ ఇచ్చేశారు. అలా గ్రేటర్ టెంక్షన్ పెట్టుకోకుండా సేవ్ అయ్యారు.
మరొక పార్టీ జనసేన మొదట్లో తొందరపడినా తర్వాత సర్దుకుంది. అభ్యర్థులు పోటీకి సిద్ధమైనా కూడ చివరి నిముషంలో పవన్ డ్రాప్ అవ్వమని కోరారు. బీజేపీకి మద్దతిచ్చారు. ఒకవేళ పోటీచేసి ఉంటే టీడీపీ తరహాలోనే చిత్తయ్యేవారే. కానీ విరమించుకుని తప్పించుకున్నారు. సపోర్ట్ చేసి వారి గెలుపులో కాస్త వాటాను కూడ తీసుకున్నారు. కానీ బాబుగారే సరైన అభ్యర్థులు లేరని తెలిసి కూడ 106 సీట్లలో పోటీకి నిలిచారు. చివరికి పలాయనం చిత్తగించి తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైందని చేతులారా నిరూపించుకున్నారు.