టీడీపీ అధినేత చంద్రబాబు నయా వ్యూహం.. వైసీపీ కీలకనేత, మంగళగిరి ఎమ్మెల్యేకు ఈ సారి పక్కాగా చెక్ పెట్టేలా ఉందనే వ్యాఖ్యలు గుంటూరు జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రాజకీయాలు ఎప్పడూ ఒకేలా ఉండవు కదా.. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ రాజకీయాలు కూడా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పుంజుకునేలా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా రాజధాని సహా.. అనేక ప్రాజెక్టుల ఏర్పాటుతో.. గుంటూరు జిల్లాలో తనకు తిరుగు ఉండదన్న అంచనాలతో బాబు ముందు నుంచి ధీమాగా ఉన్నారు. అయితే.. ఎక్కడో తేడా కొట్టింది. దీంతో గత ఏడాది ఎన్నికల్లో గుంటూరులో పట్టు సాధించలేక పోయారు. ఈ నేపథ్యంలో గుంటూరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తన కుమారుడు ఓడిపోయిన మంగళగిరిపై చంద్రబాబు మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున విజయం సాదించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. టీడీపీని ఇబ్బందులు పెడుతున్న విషయం తెలిసిందే. అంటే.. చంద్రబాబు నిర్ణయాలపై ఆయన అనేక సార్లు కోర్టుల్లో న్యాయ పోరాటాలు చేశారు. అదే సమయంలో రాజధాని భూమలపైనా ఆయన కోర్టుల్లో కేసులు వేశారు. దీంతో ముందుకు సాగాల్సిన రాజధాని కూడా కొంత ఇబ్బందులు వచ్చాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆళ్ల తన న్యాయ పోరాటాలతో నాడు ప్రభుత్వానికి, చంద్రబాబుకు అనేక ఇబ్బందులు సృష్టించారు.
ఇదిలావుంటే.. ఆళ్లకుచెక్ పెట్టాలని చంద్రబాబు ప్రయత్నించినా.. ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆళ్లను ఇంటికి పంపించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో టీడీపీ తరఫున బీసీ మహిళకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా పద్మశాలి వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధకు ఇంచార్జ్ పోస్టు ఇచ్చేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారని చెబుతున్నారు.