బిజెపినే జగన్ కు ప్రత్యామ్నాయమా ?

రాబోయే ఎన్నికల్లో వైసిపికి ప్రత్యామ్నాయంగా బిజెపినే ఎదుగుతుందని కేంద్రహోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పటం వినటానికి కాస్త విడ్డూరంగానే ఉంది. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు తెలుగుదేశంపార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లైంది. దాంతో ఇక టిడిపి పనైపోయిందని వైసిపికి తామే ప్రత్యమ్నాయమంటూ బిజెపి నేతలు రెచ్చిపోతున్నారు.

నిజానికి తెలుగురాష్ట్రాల్లో బిజెపి ఉనికి నామమాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణాలో కాస్త అయినా బిజెపి బలం ఉందేమో కానీ ఏపిలో మాత్రం పార్టీ బలం సూన్యమనే చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లలో పోటీ చేసిన బిజెపి ఒక్కసీటులో కూడా గెలవలేదు. గెలుపు సంగతి అలాగుంచినా కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేదు.

దేశవ్యాప్తంగా నరేంద్రమోడి హవా వీచినా ఏపిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి దెబ్బకు నామరూపాలు లేకుండా పోయింది. సరే పనిలో పనిగా టిడిపి కూడా ఘోరంగా ఓడిపోయింది. దాంతో వెంటనే బిజెపి కన్ను టిడిపి నేతలపై పడింది. దాంతో వలసలకు తెరలేపింది. అరువు తెచ్చుకునే టిడిపి నేతలతో వచ్చే ఎన్నికల్లో జగన్ ను ధీటుగా ఎదుర్కోవచ్చని కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ అనుకుంటున్నట్లున్నారు.

పాలనలో జగన్ ప్రస్తుత దూకుడు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టిడిపికి మొన్న వచ్చిన సీట్లు రావటం కూడా అనుమానమే. ఈ నేపధ్యంలో టిడిపికే దిక్కులేకపోతే బిజెపికి ఏపిలో జెండా ఎగరేయటం ఎలా సాధ్యమో కిషనే చెప్పాలి. గ్రౌండ్ రియాలిటిని మరచిపోయి విన్యాసాలు చేస్తే మొన్నటి ఎన్నికల్లో ఫలితాలే ఎదురవ్వటంలో ఆశ్చర్యం లేదు.