బిజెపితో పొత్తు కాదు, కొట్లాటే అంటున్న వైసిపి

బిజెపితో వైసిపి పొత్తు ఉంటుందన్న వార్తలతో వైసిపి సతమతమవుతుంది. గత కొద్ది రోజులుగా వస్తున్న ఈ వ్యాఖ్యలతో వైసిపి నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఈ వార్తలు అబద్దం అంటూ వైసిపి నేతలు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం బిజెపి నేత, కేంద్రమంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వైసిపితో బిజెపి పొత్తు  ఉంటుందని, వైసిపి నేతలు మాకు టచ్ లోనే ఉన్నారని ఆ మంత్రి వ్యాఖ్యానించారు. దీంతో ముందుగా నిశ్శబ్దంగానే ఉన్న వైసిపి  నేతలు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అబద్దం అంటూ ఖండిస్తున్నారు. ఎందుకంటే బిజెపికి దేశవ్యాప్తంగా ఎదురుగాలి మొదలైంది. ప్రధాని మోదీ గాలితో 2014లో అధికారంలోకి వచ్చిన బిజెపి ఇప్పుడా మోదీ గ్రాఫ్ తోనే పడిపోతుందది. ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం, మోదీ దేశంలో తిరిగిన పర్యటనల కంటే విదేశాల పర్యటనలే ఎక్కువ చేయడంతో దేశ సమస్యలను పరిష్కరించటంలో విఫలమయ్యారనే పేరు సంపాదించుకున్నారు. బిజెపి కర్ణాటక ఎన్నికల్లో గెలిచినా అధికారం సాధించుకోలేకపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన విభజన హామీలను అమలు పర్చటంలో విఫలమై తెలుగు రాష్ట్రాల్లో వ్యతిరేకతను బిజెపి సంపాదించుకుంది.

పార్లమెంట్, రాజ్యసభల్లో తెలంగాణ బిల్లుకు బిజెపి మద్దతు పలికింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బిజెపి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్ని అమలు చేయాల్సిన బాధ్యత బిజెపి ప్రభుత్వంపై  ఉంది. ఏపికి ప్రత్యేకహోదా, రైల్వే జోన్, ఉక్కు కర్మాగారం, ఇతరత్రా హామీలన్ని విభజన చట్టంలో ఉన్నాయి. కానీ వాటిని ఏవీ కూడా అమలు పర్చకుండా ప్రజల  నుంచి బిజెపి వ్యతిరేకత సాధించుకుంది. దీంతో బిజెపితో అనుబంధంగా ఉన్న  టిడిపి… బిజెపి కూటమి నుంచి వైదొలిగింది. ఆ తర్వాత టిడిపి బిజెపి పోరాడటంలో స్వరం పెంచింది. వైసిపి ఎంపీలు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఆమోదించుకున్నారు. ఇటువంటి తరుణంలో బిజెపితో వైసిపి పొత్తు పెట్టుకుంటుందన్న వార్తలు వైసిపికి తలనొప్పిగా మారాయి.

బిజెపి కూటమి నుంచి బయటికి వచ్చిన టిడిపి ఏపికి రావాల్సిన నిధులు, హక్కుల కొరకు బిజెపి పై గట్టిగానే పోరాడుతుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అవిశ్వాసం పెట్టాలని చూస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ  ఎంపీలు అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వీటన్నింటిని గమనించే వైసిపి ఆచితూచి అడుగు వేస్తుంద.  ఈ సమయంలో బిజెపితో ఎట్టి పరిస్థితిలో వైసిపి కలిసే ప్రసక్తే లేదనే భావనను వైసిపి నేతలు చెబుతున్నారు.

జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని ఆయన ఎట్టి పరిస్థితిలో మాట మారే మనిషి కాదంటున్నారు వైసిపి నేతలు. వైసిపి నేత పార్థసారధి ఒక అడుగు ముందుకేసి బిజెపితో వైసిపి పొత్తు ప్రసక్తే లేదని, ఒక వేళ వైసిపి బిజెపితో పొత్తు పెట్టుకుంటే రాజకీయాల  నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలతో వైసిపిలో కలవరం మొదలైనట్టుంది. ఎందుకంటే ఒకవేళ పొత్తుపెట్టుకున్నా బిజెపి మీద ఉన్న  వ్యతిరేకతతో రాష్ట్రంలో సీట్లు తగ్గుతాయని వైసిపి ముందే భావించినట్టుందనే వార్తలు కూడా వస్తున్నాయి.  బిజెపి, వైసిపిల పొత్తు నిజమా లేక ఇది బిజెపి కావాలనే ప్రజల్లోకి అలా వదిలిన బాణమా అన్న  చర్చ ఆంధ్ర  రాజకీయాల్లో జోరుగా నడుస్తుంది.