ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్ల వైసీపీ పాలన మద్యం వినియోగాన్ని పెంపొందించిందనే ఆరోపణలు, ఇప్పుడు గణాంకాలతో మరింత బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం, 2019–2024 మధ్య మద్యపాన కారణంగా కాలేయ వ్యాధుల కేసులు 100 శాతం పెరిగాయి. ఆరోగ్యశ్రీ డేటా ఆధారంగా తీసిన ఈ గణాంకాలు గత ప్రభుత్వ వ్యవస్థపై తీవ్రవిమర్శలకు దారితీశాయి.
2014–2019 సమయంలో 14,026గా ఉన్న కాలేయ సంబంధిత కేసులు, గత ప్రభుత్వం హయాంలో ఐదేళ్లలో 29,369కి చేరాయి. అదే సమయంలో నరాల సంబంధిత వ్యాధులు 1,276 నుంచి 12,663కి పెరగడం అత్యంత ఆందోళనకరంగా నిలిచింది. ఇది ఏకంగా 892 శాతం వృద్ధి. నిపుణుల వ్యాఖ్యల ప్రకారం, ఇది కేవలం మద్యం వినియోగం వల్లే కాక, నాణ్యతలో లోపం ఉన్న మద్యం వల్ల కూడా జరుగుతుండవచ్చని పేర్కొన్నారు.
అధికారులు మద్యం సరఫరా వ్యవస్థపై దృష్టి సారించారు. ప్రజాదరణ పొందిన బ్రాండ్లను దూరం పెట్టి, అనుభవం లేని కొత్త బ్రాండ్లను లబ్ధిదారులుగా మార్చడం, వాటి నాణ్యతపై అనుమానాలు రావడం, మానవ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే అంశాలుగా మారాయని ఎస్ఐటీ మధ్యంతర నివేదిక చెబుతోంది.
ఈడీ దర్యాప్తు ప్రకారం, కొనుగోలు ఉత్తర్వుల తారుమారులు, అనుమతుల దుర్వినియోగం, దేశవ్యాప్తంగా పేరున్న బ్రాండ్లను తొలగించి, కొత్తగా ప్రవేశపెట్టిన బ్రాండ్లను ప్రోత్సహించడం వంటి చర్యలు ఆరోగ్యవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపించాయని చెబుతోంది. ఇప్పుడైనా మద్యపానంపై ఓ సమగ్ర రాజకీయ చర్చ ప్రారంభమవ్వాలి. సాంకేతికంగా, వైద్యపరంగా, ఆర్థికంగా మద్యం వలన కలిగే నష్టాలను అర్థం చేసుకొని, పునఃప్రారంభమవుతున్న పాలన మద్యం విధానంలో మార్పు తీసుకురావాలన్నదే సామాజిక వర్గాల ఆశ.