కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి హైదరాబాద్ లో దాగి, ఇప్పుడొచ్చి ఈ దొంగ దీక్షలేంటని టీడీపీ అధినేత చంద్రబాబుని ఏపి ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రశ్నించారు. సాధన దీక్ష పేరుతో చంద్రబాబు హైడ్రామా చేశారని మంత్రి ఆళ్ల నాని విమర్శించారు. రాష్ట్రం అంతా కరోనాతో అల్లాడుతున్న సమయంలో తండ్రీ కొడుకులు ఇంట్లో తిన్నదరగటానికి జూమ్ మీటింగ్ లు పెట్టి కాలక్షేపం చేశారని మంత్రి మండిపడ్డారు.
అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి… చంద్రబాబు దీక్ష చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యాయనని అన్నారు. ఉదయం టిఫిన్ చేసి పదిగంటలకు దీక్షకు కూర్చుని 1గంటకు ముగించి ఇంటికెళ్లి తినడం దీక్షా అని నిలదీశారు. ఈరోజు దీక్షతో చంద్రబాబు సాధించింది ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు శవ,కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి అన్నారు.
కరోనాను ఎదుర్కొటంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు మాట్లాడటం కేవలం ప్రభుత్వం మీద బురద జల్లటానికేనని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని గుర్తు చేసిన ఆయన… రెండవ దశనూ సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. దీక్షల పేరుతో సీఎం జగన్ ను, ప్రభుత్వాన్ని నిందిస్తే జనాలు నమ్మే స్థితిలో లేరన్నారు.