తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్

విద్యుత్ మౌళిక రంగాల్లో అభివృద్ది పై శనివారం శ్వేత పత్రం విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ పై హాట్ కామెంట్స్ చేశారు. కరెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తమకు ఇంకా  5500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెల్లించకపోతే కోర్టుకు వెళ్లి రావలిసింది రప్పించుకుంటామన్నారు. చంద్రబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే….

“కేంద్ర ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ కు సహాయం చేయకుండా మోసం చేసింది. విద్యుత్ అందించడంలో కూడా దగా చేసింది. అందుకే పునరుత్పాదక ఇంధనం పై దృష్టి సారించాం. విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ ఏపీకి ఇంకా రూ.5500 కోట్ల రూపాయలు చెల్లించాలి. కరెంట్ అన్నది ఫ్రీగా రాదు. తెలంగాణ ఏపీ కరెంట్ వాడుకున్నది వాస్తవమా కాదా అనే విషయాన్ని ఆలోచించాలి. ఏపీకి ఉన్న బాకీని తెలంగాణ తీర్చాల్సిందే. ఒక వేళ ఈ చెల్లింపులకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాకపోతే న్యాయ పరంగా ముందుకు వెళుతాం. కోర్టుకు వెళ్లి ఏపీకి రావాల్సిన డబ్బును వసూలు చేస్తాం.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందించేందుకు కృషి చేస్తున్నాం. దుగ్గరాజపట్నం, రామాయ పట్నం పోర్టుల విషయంలో కేంద్రం సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తుంది. కేంద్రం సాయం లేకపోయినా రామాయ పట్నం పోర్టును స్వంతంగా ప్రారంభించాం. విజయవాడ నుంచి సింగపూర్ కు ప్రారంభించిన విమాన సర్వీసుకు మంచి స్పందన వచ్చింది. ఈ మార్గంలో మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తెస్తాం.” అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 

ఎప్పుడు ఆలోచించి ఆచితూచి మాట్లాడే సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం పై ఘాటుగా మాట్లాడడంతో చర్చనీయాంశమైంది. కరెంట్ చెల్లింపుల విషయంలో బాకీ మొత్తం చెల్లించాల్సిందేనని లేకపోతే కోర్టుకు వెళుతామని హెచ్చరించడం పై అందరూ చర్చించుకుంటున్నారు. చంద్రబాబు డోస్ పెంచి మాట్లాడడంతో టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ విషయంలో చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. చెల్లింపులు నిలిచి పోవడంతో ఏపి కి నష్టం జరుగుతుందని ఏపీలో కూడా కరెంట్ కొరత లేకుండా చూడాలంటే వసూలు కావల్సినవి వసూలు చేసుకొని ముందుకు వెళ్లాలని నేతలతో ఆయన అన్నట్టు తెలుస్తోంది.