ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ భేటీ ప్రారంభం

ap cm jagan

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రెండో విడత ‘జగనన్న అమ్మ ఒడి’ పథకానికి ఆమోదం తెలుపనున్నారు. అలాగే , ఈ రోజు మొత్తం 26 అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.

 

ap cm ys jagan delhi tour

ఇందులో ప్రధానంగా పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా రూ.5 వేల కోట్ల రుణం తీసుకోవడం, ఏపీలో నూతన పర్యాటక విధానంపై చర్చించి ఆమోదం తెలపడం వంటి అంశాలపై చర్చిస్తున్నారు.

ఈ ఏడాది జనవరి 9వ తేదీన తొలి విడత జగనన్న అమ్మ ఒడి పథకం అమలు చేశారు. వరుసగా రెండో విడత మళ్లీ వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన జగనన్న అమ్మ ఒడి పథకం కింద అర్హులైన తల్లులకు రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గ సమావేశంలో అమోదించనున్నారు.

జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించడంతో పాటు.. పేద వర్గాల పిల్లలను పనులకు పంపకుండా బడికి పంపేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే సంక్రాంతికి ముందే వైఎస్సార్‌ రైతు భరోసా కింద రైతులకు ఆర్థిక సాయం అందించడంపై మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తారు. నియోజవర్గాల్లో పశువుల ఆరోగ్య పరీక్షల ల్యాబ్‌లు ఏర్పాటుతో పాటు పలు అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

అలాగే, ఇళ్ల పట్టాల పంపిణీ, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతు భరోసా పథకం, ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు వంటి అంశాలపై చర్చిస్తారు. ఆరు జిల్లాల్లో వాటర్‌ షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.