ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద సంతోషం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా, ప్రతి ఒక్కరూ ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలను పొందే అవకాశం రానుంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం గురువారం జరిగిన సమావేశంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ప్రత్యక్ష లబ్ధి కలగనుంది.
క్యాబినెట్ ఆమోదించిన కొత్త హెల్త్ పథకం కింద ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సలు లభించనున్నాయి. ముఖ్యంగా పేద కుటుంబాలు మాత్రమే కాకుండా మధ్యతరగతి, ఉన్నత వర్గాలకూ ఈ పథకం వర్తిస్తుంది. అంటే ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు భద్రతతో కూడిన వైద్య బీమా కవరేజ్ పొందనున్నాడు.
ఈ హైబ్రిడ్ విధానం కింద ప్రభుత్వమే ప్రత్యేకంగా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, ఇన్సూరెన్స్ కంపెనీలతో కలిపి మొత్తం వ్యవస్థను నడపనుంది. రూ.2.5 లక్షల వరకు ఖర్చయ్యే చికిత్సలను ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తే, రూ.2.5 లక్షల నుండి రూ.25 లక్షల వరకూ వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరించనుంది. ఈ క్రమంలో 3,257 రకాల వైద్య చికిత్సలు ఉచితంగా అందించబడతాయి. ముఖ్యంగా కేవలం ఆరు గంటల్లోనే ప్రీ-ఆథరైజేషన్ మంజూరు అయ్యేలా ప్రత్యేక మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రభుత్వం అమలు చేయనుంది.
ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,493 నెట్‌వర్క్ ఆస్పత్రులను గుర్తించారు. ప్రజలు ఈ ఆస్పత్రులలో ఎప్పుడైనా చికిత్స పొందవచ్చు. అత్యాధునిక సర్జరీలు, హృద్రోగ చికిత్సలు, క్యాన్సర్ చికిత్సలు, కిడ్నీ సంబంధిత ఆపరేషన్లు వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా 1.43 కోట్ల పేద కుటుంబాలకు ఈ పథకం వరం కానుంది. అదనంగా మరో 20 లక్షల కుటుంబాలు కూడా దీనితో లబ్ధి పొందనున్నాయి.
ఆరోగ్య రంగానికే కాకుండా విద్యా రంగానికీ క్యాబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వైద్యుల కొరత తీరేందుకు పీపీపీ విధానంలో 10 కొత్త మెడికల్ కాలేజీల స్థాపనకు ఆమోదం తెలిపింది. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో ఈ కొత్త మెడికల్ కాలేజీలు దశలవారీగా ప్రారంభం కానున్నాయి. తదుపరి దశలో మరో ఆరు ప్రాంతాల్లో కూడా కాలేజీల స్థాపనకు అవకాశం ఉందని సమాచారం.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఆరోగ్యరంగం పూర్తిగా మారిపోనుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల హెల్త్ కవరేజ్ కల్పించడం ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ లేనిది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ దేశంలోనే హెల్త్ సెక్టార్‌లో కొత్త రికార్డు సృష్టించనుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
