AP Cabinet: వాహనదారులకు గుడ్ న్యూస్ .. కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం

AP Cabinet

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర మంత్రులు, సీఎస్ విజయానంద్ హాజరయ్యారు. ముందుగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే 13 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఆటోడ్రైవర్లకు వాహనమిత్ర పథకం కింద రూ.15 వేలు ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అక్టోబర్ 1న అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15వేలు పడనున్నాయి.

నాలా ఫీజు రద్దు చట్ట సవరణ, జీఎస్టీలో సంస్కరణలు అమలు -2025 బిల్లు, ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టసవరణ, ఏపీ విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లిఫ్ట్‌ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయించేలా నిర్ణయం తీసుకుంది. అలాగే వైఎస్‌ఆర్‌ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా సవరణకు కేబినెట్ ఆమోదించింది.

ఓటర్ల జాబితా తయారీకి తేదీల ఖరారు ప్రతిపాదనకు అనుమతి ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు అంగీకరించింది.

మరోవైపు రాష్ట్రంలోని వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మోటారు వాహనాల ట్యాక్సేషన్ చట్టంలో సవరణలు చేసిన బిల్లును రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చిదే గ్రీన్ ట్యాక్స్ రూ.20 వేల నుంచి రూ.3000లకు తగ్గనుంది. సాధారణంగా భారీ వాహనాలకు ఏడేళ్ల తర్వాత ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలంటే గ్రీన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.