Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ బేటీ.. రూ.1.14లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం..!

ఏపీ కేబినెట్ నేడు భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ సమావేశంలో భారీ పెట్టుబడులు, రాజధాని అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మొత్తం రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడుల ద్వారా 26 పెద్ద ప్రాజెక్టులు అమలు కానున్నాయి. వీటితో 67,218 మందికి పైగా ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఈ కేబినెట్‌లో అతిపెద్ద పెట్టుబడిగా విశాఖపట్నంలో రూ.87,520 కోట్లతో Raiden Infotech డేటా సెంటర్ నిర్మాణానికి ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తే, ఉత్తరాంధ్ర ప్రాంతానికి భారీ ఆర్థిక లాభాలు చేకూరనున్నాయి. రాజధాని అమరావతి అభివృద్ధికి ఈ కేబినెట్ సమావేశం కీలక మలుపుగా నిలవనుంది. రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం లభించనుంది. కృష్ణా నది ఒడ్డున రాజధాని ప్రభుత్వ సముదాయంలో గవర్నర్ నివాసం రూపుదిద్దుకోనుంది. అదేవిధంగా నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా ఆమోదం లభించే అవకాశం ఉంది. రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా మార్పులు చేస్తూ సుస్థిర అభివృద్ధికి మార్గం సుగమం చేయనుంది ప్రభుత్వం.

Andhra Pradesh Capital Region Development Authority (సీఆర్డీఏ) మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను వినియోగించేందుకు ఆమోదం లభించనుంది. అదనంగా, కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8,400 క్యూసెక్కుల సామర్థ్యంతో కొత్త పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించవచ్చు. టెక్నాలజీ రంగంలో మరో పెద్ద అడుగుగా అమరావతిలో క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి సీఆర్డీఏను ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా నియమించే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించనుంది. అదేవిధంగా హ్యాపీ నెస్ట్, ఏపీ ఎన్నార్టీ ప్రాజెక్టులకు బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసే అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కేబినెట్ సమావేశంలో పలు సంస్థలకు భూ కేటాయింపులు, ఉద్యోగుల డీఏ (మహంగై భత్యం) సవరణలపై కూడా చర్చించనున్నారు. ఈ నిర్ణయాల ద్వారా ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులన్నీ గ్రీన్ సర్టిఫికేషన్ నిబంధనలకు లోబడి అమలు చేయనున్నట్లు సమాచారం. సుస్థిర పట్టణ నిర్మాణానికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా అధికారులు చెబుతున్నారు.

మొత్తంగా ఈరోజు జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశం రాష్ట్ర ఆర్థిక, మౌలిక రంగాల్లో దిశా నిర్ధేశకంగా నిలవనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల హబ్‌గా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి.