“అనంతపూర్ టీడీపీ నాయకులవి దరిద్రపు ఆలోచనలు “

ఈ మాటలు అన్నది ఎవరో కాదు, అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్ రెడ్డి. ఈయన గత ఏడాది జగన్కి ప్రజా సమస్యలపట్ల చిత్తశుద్ధి లేదని, ప్రజాసమస్యలు చర్చించేదానికి జగన్ సుముకంగా లేరని, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదని అందుకే వైసీపీని విడుతున్నాను అని చెప్పి టీడీపీలో చేరారు.

ఒక సంవత్సరం తిరిగే లోపల, చంద్ర బాబు చెప్పిన అభివృద్ధి మాటలు అంత భూటకమని, టీడీపీ నాయకులకి తప్ప రాష్ట్ర ప్రజలకి చంద్ర బాబు ప్రభుత్వం వలన జరిగిన మేలేమీ లేదని, అందుకే తాను తమ కుటుంబానికి రాజకీయంగా జన్మనిచ్చిన వైస్సార్ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకొని మళ్లీ వైస్సార్సీపీలో చేరుతున్నాను అని చెప్పారు.

తాను టీడీపీలో వున్న ఈ సంవత్సర కాలంలో టీడీపీ నాయకులని చాల దగ్గరగా చూశానని వాళ్ళ గురుంచి చెబుతూ ” నేను ముప్పై ఏళ్లుగా రాజకీయాలు చూసాను, నా అనుభవంలో ఇంత నీచమైన మరియు దరిద్రపు ఆలోచనతో పనిచేసే నాయకులను అనంతపూర్ తెలుగు దేశంలోనే చూసాను. ఒకరంటే ఒకరికి గిట్టదు, ఒకరంటే ఒకరికి సరిపోదు. అభివృద్ధి గురుంచే ఆలోచించే మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని లేరు ఇక్కడ. కేవలం వాళ్ళ స్వార్థం, స్వార్థం. ఈ జిల్లాలో కోట్లాది రూపాయల ఇసుక తరలించారు, అర్బన్ పరిధిలో ఎవరు లేఔట్ వేసిన ఎమ్మెల్యేలకు పన్ను కట్టాలి” అని ముగించారు. కొసమెరుపు ఏంటంటే ఇవన్నీ చంద్ర బాబుకి తెలిసే జరుగుతున్నాయి అని చెప్పడం.

గురునాథ రెడ్డి లాంటి నాయకులకి తెలియని విషయం ఏంటంటే, ఒక పార్టీ నుండి వెళుతూ ఒక మాట, వస్తూ ఒక మాట చెబితే అది కేవలం మీ సౌకర్యం కోసం చేసే విమర్శలని లేక పొగడ్తలని ప్రజలకి బాగా తెలుసు. ఇటువంటి మాటలకి పెద్దగ విశ్వసనీయత ఏమి వుండదు. కేవలం టీవీ కాలక్షేపానికి మాత్రమే పనికి వస్తాయి. అనంతపూర్ టౌన్ పరిధిలో నారాయణరెడ్డి కుటుంబాన్ని ఒక గౌరవం వుండేది. ఇలాంటి పనుల వలన ఆ గౌరవం తరుగుతుందే తప్ప పెరగదు.