10 ప్లస్ 5.! బీజేపీకి వైసీపీతో హ్యాపీయేనట.!

వైసీపీ నుంచి భారతీయ జనతా పార్టీ 10 ఎమ్మెల్యే సీట్లను ఆశిస్తోందిట. ఐదు ఎంపీ సీట్లు కావాలని అడుగుతోందిట.! ఇది జాతీయ స్థాయి బీజేపీ నాయకత్వం, వైసీపీ ముందుంచిన ప్రతిపాదన.. అనే ప్రచారం జరుగుతోంది.

అసలు వైసీపీతో బీజేపీ ఎలా కలుస్తుంది.? అంటే, వైసీపీతో కలిస్తే తప్ప రాజకీయంగా ఎదిగే పరిస్థితి లేదన్న భావనకు ఏపీలో బీజేపీ వచ్చేసిందట. పైగా, టీడీపీని నమ్మినా.. జనసేనను నమ్ముకున్నా ప్రయోజనం లేదని బీజేపీ బలంగా నమ్ముతోందిట.

2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో వైసీపీ సహకారాన్ని బీజేపీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీతో మైత్రి అవసరమని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, ఎమ్మెల్యే సీట్ల సంగతెలా వున్నా, ఎంపీ సీట్ల విషయంలో కాస్త గట్టిగా పట్టుబట్టే అవకాశముందట బీజేపీ.

బీజేపీతో కలిసేందుకు వైసీపీకి పెద్దగా అభ్యంతరాలు వుండకపోవచ్చు. రాష్ట్రంలో మరో రాజకీయ ప్రత్యామ్నాయం ఏదీ వుండకూడదన్న భావనలో వైసీపీ వుంది. ఈ నేపథ్యంలో బీజేపీతో చేతులు కలిపి, టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేయడంతోపాటు, జనసేనకు అస్సలు ఆస్కారం లేకుండా చేయాలన్నది వైసీపీ వ్యూహమట.

ఈ మొత్తం వ్యవహారంపై జనసేనానికీ ఓ క్లారిటీ వుంది. అందుకే, బీజేపీతో పని జరగదని భావించిన జనసేనాని, టీడీపీకి దగ్గరవుతున్నారు. ‘టీడీపీతోనే కలిసి వెళదాం..’ అని బీజేపీని ఒప్పించేందుకు ప్రయత్నించిన పవన్ కళ్యాణ్, ఈ క్రమంలో విఫలమయ్యారు.

కాగా, జనసేనకు అవసరమైతే 75 సీట్లు కేటాయించడానికైనా టీడీపీ సిద్ధంగానే వుందన్నది ఓ ప్రచారం.! కానీ, నలభై నుంచి యాభై సీట్లకు మించి జనసేనాని ఆశించడంలేదట టీడీపీ నుంచి.!