ఏపీ, తెలంగాణ ఏ రాష్ట్రంలోనైనా మద్యపానాన్ని నిషేదించాలని ఇటు ప్రజలు అటు నాయకులు ఎప్పటి నుంచో అనుకుంటున్నవిషయమే. వాటి వల్లే తెలుగు రాష్ట్రాల్లో మహిళల పై అత్యాచార ఘటనలు ఎక్కువయ్యాయన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కాని అవి కొన్ని కారణాల వల్ల ఎప్పటికప్పుడు అలా అయిపోతుంది. ఇక ఇదిలా ఉంటే… స్వామి పూర్ణానంద తెలంగాణలో మద్యపానాన్ని నిషేధిస్తే సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కడానికైనా సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ కన్నీటి శాపం తెలంగాణ నేలకు తగలకుండా ఉండాలంటే విడతల వారీగానైనా మద్య నిషేధం విధించాలని ఆయన కేసీఆర్‌కు సూచించారు. ప్రజల బలమైన ఆకాంక్షలకు అనుగుణంగానే దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారే తప్ప.. ఇందులో పోలీసులు, ప్రభుత్వ ఘనత ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డీకే అరుణ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన సంకల్ప దీక్ష ముగిసింది. స్వామి పరిపూర్ణానంద అరుణకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
భారత జనతా పార్టీనాయకురాలైన డీకే అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాలు విసిరారు. మహిళలపై గౌరవం ఉంటే మద్య నిషేధం అంశంపై తనతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు కూడా భార్య పిల్లలున్నారన్న ఆమె.. రాష్ట్రంలోని ఆడబిడ్డల భద్రత గురించి కేసీఆర్ ఆలోచించాలని సూచించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో …
డీకే అరుణ మాట్లాడుతూ.. ‘‘మద్య నిషేధం కోసం నేను దీక్ష చేపడుతుంటే.. బిస్కెట్‌లు తినే కుక్కలతో మాట్లాడించారు. దమ్ముంటే మీరు మాట్లాడండి. ఎక్కడికైనా చర్చకు వచ్చేందుకు సిద్ధం. రాష్ట్రంలో యువత మద్యానికి బానిసలవుతున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలి.’’ అని తీవ్ర స్థాయిలో సవాల్ విసిరారు. మహిళల ఆవేదనను ఆర్థం చేసుకుని మద్య నిషేధం అమలు చేయాల్సిందేనని సూచించారు. యాదాద్రి ప్రధాన ద్వారం వద్ద 3 మద్యం దుకాణాలకు దేని ప్రకారం అనుమతిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని బెల్టు షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు.