ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్బంగా అమరావతిలో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మూడు రాజధానుల అంశంపైనే చర్చిస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదిక పై సమగ్రంగా చర్చ జరుగుతోంది. అలాగే అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై కూడా మధ్యాహ్నం తరువాత చర్చకు వచ్చే అవకాశం ఉంది. రైతుల ఆందోళన, సీఆర్డీఏ వ్యవహారాలపైనా కేబినెట్‌లో చర్చ జరగనుంది.
మూడు రాజధానుల పై జగన్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే రైతులను ఆదుకుంటామనే ప్రకటనలు చేసేందుకు కారణాలు ఏమయి ఉంటాయి… అమరావతి ప్రాంత రైతులను, రాష్ట్ర ప్రజలను మానసికంగా వారిని సిద్ధం చేస్తున్నారా అన్నది మరికొద్దిసేపట్లో ఏపీ రాజధానిపై కీలక ప్రకటన చేయబోతున్నారన్నది నిర్ణయమైంది. ప్రభుత్వం తీసుకోబోతున్న మూడు రాజధానుల నిర్ణయం పై ప్రభుత్వం ముందస్తుగానే లీకులిస్తున్నట్లు కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే కృష్ణా, గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం అయ్యారు.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లక్ష కోట్లకు పైగా రాజధాని కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదని ఆయన తేల్చి చెప్పారు. జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. జీఎన్‌రావు కమిటీ నివేదికపై ఏపీ కేబినెట్‌లో చర్చ.. సమావేశంలో చర్చకు వచ్చిన రాజధాని రైతుల ఆందోళన చేపట్టారు. ఇటు మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా సచివాలయం మాత్రమే తరలివెళ్తుందంటూ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాజధాని అంటే కొత్త పట్టణాల నిర్మాణం కాదని కుండబద్దలు కొట్టారు.
రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు. అయితే వైసీపీ నేతలు, మంత్రుల ప్రకటనలతో రాజధాని ప్రాంత రైతులు భగ్గుమన్నారు. తుళ్లూరు, ఉద్దండరాయపాలెంలో రైతులు చీకట్లో కూడా రోడ్డెక్కారు. ఓ వైపు 144 సెక్షన్ అమల్లో ఉన్నా లెక్కచేయలేదు. దీంతో ముందస్తుగా పోలీసులు పలు చర్యలు చేపట్టారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే చర్యలు తీసుకునేందుకు వాటర్ కెనెన్స్, టియర్ గ్యాస్ ప్రయోగాలకు కూడా వెనకాడటం లేదు. ఏదేమైనా డిసెంబర్ చలిలో వేడెక్కిస్తున్న ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం మరికొన్ని గంటల్లో చోటు చేసుకోబోతంది. ఓ పక్క రైతుల ఆందోళన కూడా మాములుగా లేదు. మరి జగన్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.