రౌడీ గారూ బెండ ముదిరితే ఎలా?
విజయ్ దేవరకొండ నటించిన `డియర్ కామ్రేడ్` ఈ శుక్రవారం (జూలై 27) ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాకి దాదాపు 40 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ సాగిందని తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ లోనూ భారీగానే ఆర్జించారన్న ముచ్చట ట్రేడ్ లో వినిపిస్తోంది. దేవరకొండకు మెట్రోల్లో ఉన్న ఆదరణ దృష్ట్యా చెన్నయ్, హైదరాబాద్, బెంగళూరు వంటి చోట్ల బోలెడంత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. చివరిగా వైజాగ్ లో కామ్రేడ్ విజిట్ ముగిసింది. నిన్న సాయంత్రం విశాఖ బీచ్ రోడ్ లోని నోవాటెల్ లో కామ్రేడ్ టీమ్ పాత్రికేయులతో ముచ్చటించింది.
ఈ కార్యక్రమంలో దేవరకొండ మాట్లాడుతూ అసలు `డియర్ కామ్రేడ్` అంటే మీనింగ్ ఏంటో తెలిపారు. ఆర్మీలో ఇంతకుముందు కమ్యూనిస్టుల తరహాలోనే కామ్రేడ్ అని పిలుచుకునేవారు. సమస్యల విషయంలో స్పందించే కామ్రేడ్ లాంటి కుర్రాడి కథ ఇది. అందుకే డియర్ కామ్రేడ్ అని పెట్టుకున్నాం. డియర్ అంటే ఆప్యాయంగా పిలుచుకునేది అని టైటిల్ మీనింగ్ ని రివీల్ చేశారు.
ఇక వేరొక చిట్ చాట్ లో పెళ్లెప్పుడు? అన్న ఆసక్తికర ప్రశ్న రౌడీకి ఎదురైంది. ఈ ప్రశ్నకు ఏమాత్రం తడబడకుండా మరో ఐదేళ్ల తర్వాత ఉంటుందని తెలిపారు విజయ్. 35 ఏళ్ల వయసు వచ్చాక పెళ్లి చేసుకుంటానని వెల్లడించారు. అయితే ఇదివరకూ ఓ సందర్భంలో 30 వయసు (ప్రస్తుత వయసు ఇది) రాగానే పెళ్లాడేస్తానని చెప్పిన దేవరకొండ ఈసారి మాట మార్చారు. మరో ఐదేళ్ల పాటు వాయిదా వేసేసారు. సక్సెస్ ఇచ్చిన కిక్కులో పెళ్లిని ఇలా వాయిదా వేస్తున్నారా రౌడీ గారూ? ఇంకా ఎన్నాళ్లు బ్యాచిలర్ గా ఉంటారు? అంటూ యూత్ లో ఒకటే ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా గాళ్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న దేవరకొండ ఇంకా ఎందుకిలా ఆలోచిస్తున్నారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి రౌడీ గారు ఏమని స్పందిస్తారో?