గాడ్ థ్రిల్ల‌ర్ సినిమా చూపిస్తున్నాడా వ‌ర్మా?

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కి ఆ దేవుడు ఈ ఏడాదంతా రాసిచ్చేసిన‌ట్లున్నాడు. వ‌ర్మ వ్య‌క్తిత్వానికి త‌గ్గ‌ట్టు గాడ్ కూడా ఈ ఏడాది జ‌నాల‌తో అలాగే ఆడుకుంటున్నాడు. ఏడాది ఆరంభంలో క‌రోనా భ‌యం పెట్టాడు. దాదాపు 5 నెల‌లుగా ప్ర‌పంచ దేశాల‌ను క‌రోనా వైర‌స్ అట్టుడుకిస్తోంది. భార‌త్ కి రెండు నెల‌లుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వీట‌న్నింటిపై వ‌ర్మ ఏ స్థాయిలో వెట‌కారం చేసాడో? తెలిసిందే. సాధార‌ణంగానే వ‌ర్మ ముక్కుసూటి మ‌నిషి. నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడేయడం ఆయ‌న నైజం.

ఎదుట‌వారి మ‌నోభావాల‌తో సంబంధం లేని వాడు. త‌న‌కు మాన‌సిక ఆనందం దొరికిందా? లేదా? అన్న‌దానికే ప్రాముఖ్య‌త‌నిస్తాడు. తాజాగా నేడు విశాఖ‌లో జ‌రిగిన గ్యాస్ విస్పోట‌నం గురించి ఎంత‌లా వెట‌కారించాడంటే? వైర‌స్ త‌ర్వాత ఇప్పుడు గ్యాస్ ఎటాక్. ఇక భూమ్మీద‌కు ఏలియ‌న్స్ రావ‌డ‌మే ఆల‌స్యం. సినిమా ఇండ‌స్ర్టీ ష‌ట్ డౌన్ కావ‌డంతో దేవుడు నిజ జీవితాల‌లో థ్రిల్ల‌ర్ సినిమా చూపిస్తున్నాడు. జాతి, మ‌తం, దేశం అన్న బేధాలు లేకుండా ఆడ, మ‌గ‌, చిన్నారులు చంపే మూడు శ‌క్తులు ఉగ్ర‌వాదులు, వైర‌స్ లు, దేవుడు.

దేవుడు మాన‌సికంగా ఏం ఇబ్బంది ప‌డ‌టం లేదు క‌దా. ఇలాంటి ప్రాణాంత‌క వైర‌స్ ల‌ను, గ్యాస్ లీకేజీల‌ను సృష్టిస్తున్నాడు. దేవుడంటే సృష్టిలో అన్నింటిని సృష్టించేవాడు. పాలించేవాడు..అంటే వైరస్ ని, గ్యాస్ లీకేజీని దేవుడే సృష్టించాడా? కానీ మ‌నం మాత్రం దేవుడ్ని త‌ప్ప అంద‌ర్నీ బ్లేమ్ చేస్తాం. ఎందుకంటే మ‌నకి దేవుడంటే భ‌యం అని త‌న‌దైన శైలిలో త‌ను న‌మ్మే సిద్దాంతాన్ని జ‌నాల‌పై రుద్దే ప్ర‌యత్నం చేసాడు. అన్న‌ట్లు వ‌ర్మ దేవుడ్ని న‌మ్మ‌డు స‌హా వీలున‌ప్పుడ‌ల్లా ఆయ‌న‌పై వెట‌కారంగా మాట్లాడ‌టం ఓ అల‌వాటు. అటుపై దైవ భుక్తుల‌చే అక్షింతలు వేయించుకోవ‌డం ఓ అల‌వాటే.