వర్మ ప్లానింగ్ ప్రకారం అనుకున్నది అనుకున్నట్లు జరిగిందా …ఏదో ఒక వివాదం క్రియేట్ చేసి తన సినిమాను ప్రమోట్ చేసుకుందామనే ఆలోచన నెరవేరినట్లేనా అంటే నెరవేరినట్లే కనపడుతోంది. ఆయన రిలీజ్ చేసిన వెన్నుపోటు సాంగ్ ని ఎవరూ పట్టించుకోపోతే ఏ గొడవా లేదు. కానీ ఆయన లక్ష్యం అది కాదు..ఏదో విధంగా జనాలను రెచ్చగొట్టి తన సినిమాకు ఉచిత పబ్లిసిటీ తెచ్చుకోవాలి. ఇప్పుడు టీవి ఛానెల్స్, పేపర్లు, వెబ్ మీడియాలో వెన్నుపోటు సాంగ్ గురించే చర్చలు, రచ్చ..అంటే వర్మ లక్ష్యం నెరవేరినట్లే… ఈ విషయమై పూర్తి కథనం చదవండి..
ముందుగా అంతా భావించినట్లుగానే రామ్ గోపాల్ వర్మ ..వెన్నుపోటు సాంగ్ ని వివాదాలు తెచ్చిపెట్టింది. ‘దగా.. దగా.. మోసం.. నమ్మించి.. కమ్మించి వెన్నుపోటు పొడిచారు. వంచించి వంచించి వెన్నుపోటు పొడిచారు కుట్ర కుట్ర’ అంటూ పాట ప్రారంభమయ్యే పాటపై ఇప్పుడు తెలుగు దేశం వర్గాలు మండిపడుతున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పదవి నుంచి దించేశారంటూ.. ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి ఉన్న ఆనాటి ఫోటోలను చూపిస్తూ బ్యాంగ్రౌండ్‌లో పాట ప్లే చేయటం వివాదానికి కారణమైంది.
వివరాల్లోకి వెళితే… వివాదాలతోనే తన సినిమాలకు పబ్లిసిటీ చేసుకునే దర్శకుడు రాంగోపాల్ వర్మ . ఆయన రూపొందిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు దేశం పార్టీ వర్గాల కోపానికి కారణమైంది. వెన్నుపోటు పేరుతో విడుదల చేసిన పాట ద్వారా చంద్రబాబు నాయుడును కించపరుస్తున్నారని వారు మండిపడుతున్నారు. రాజకీయంగా ఓ వర్గానికి లబ్ది చేకూర్చేందుకే వర్మ ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారని ఆరోపిస్తూ నిరశనకు దిగారు.
వెన్నుపోటు పాటను వ్యతిరేకిస్తూ శనివారం విజయవాడలో కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు నిరసనకు దిగారు. వర్మ పోస్టర్లను తగలబెట్టి.. ‘జోహార్ వర్మ’ అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుట్ర, వెన్నుపోటుతో దివంగత ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు అధికారం లాక్కున్నారనే అర్ధం వచ్చే విధంగా ‘వెన్నుపోటు’ పాట రూపొందించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా వైశ్రాయ్ ఎపిసోడ్ ఉదంతాన్ని గుర్తుచేస్తూ.. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని పాటలో చూపించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎలా విడుదల చేస్తారో చూస్తామని వారు హెచ్చరించారు. వర్మ తమకు కనిపిస్తే దాడులు చేసేందుకు సైతం వెనుకాడమని చెప్పారు.
ఈ పాటను వర్మ ఆస్దాన రచయిత సిరాశ్రీ రాసారు. కీరవాణి సోదరుడు కళ్యాణి మాలిక్ పాట పాడటంతో పాటు సంగీతం కూడా అందించారు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విషయానికి వస్తే… ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు వర్మ.