మీడియాని చీమలుతో పోల్చి,చుట్టూ మూగవద్దంది

యాక్షన్ కింగ్ అర్జున్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి, వార్తల్లోకి ఎక్కిన నటి శ్రుతి హరిహరన్ ఇప్పుడు , మీడియాపై తన అసహనం వ్యక్తం చేసింది. మహిళా కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చిన ఆమెతో మాట్లాడేందుకు మీడియా పెద్దఎత్తున చేరుకోగా ఆమె వారితో ..”నేను పంచదారలా ఉన్నాను, మీరు చీమల మాదిరిగా నా వెంట పడుతున్నారు” అంటూ వ్యాఖ్యానం చేసింది. దాంతో మీడియా వారు ఆశ్చర్యపోయారు. అప్పటివరకూ మీడియా ఆమెకు సపోర్ట్ గా ఉంటూ వస్తోంది. ఈ సంఘటనతో మీడియా ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యింది.

అలా అనేసిన శ్రుతి హరిహరన్ .. లోపలి వెళ్లి కమిషన్‌ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయికి లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. అప్పుడు బయటకు వచ్చిన ఆమె, తాను మీడియా గురించి ఏమీ అనలేదని, మీడియాను గౌరవిస్తానని చెబుతూ వెళ్లిపోయింది.

ఇక లక్ష్మీబాయి.. వేధింపులపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సింది పోయి, ఇలా సోషల్ మీడియాకు ఎక్కడం ఏంటని శ్రుతిని ప్రశ్నించినట్టు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆమెకు మీడియా ఎంతవరకూ సపోర్ట్ ఇస్తుందనేది వేచి చూడాల్సిన అంశం. తనకు సోషల్ మీడియా అండ ఉంటే చాలని..ఆమె ఇలా మాట్లాడి ఉంటుందనట్లుగా మీడియాలో వినపడుతోంది.

నిబునన్(కురుక్షేత్రం) సినిమా షూటింగ్ సందర్భంగా అర్జున్ తనను లైంగికంగా వేధించాడని ఆ సినిమాలో నటిగా పనిచేసిన శృతి హరిహరన్ వెల్లడించింది. మీటూ ఉద్యమం నేపథ్యంలో పలువురు తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి వెల్లడిస్తున్నారని, తాను కూడా తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించాలనుకున్నానని చెప్పారు.

ఆమె మాట్లాడుతూ నిబునన్ షూటింగ్ సందర్భంగా ఓ రొమాంటిక్ సన్నివేశంలో నటించాల్సి వచ్చిందని, సన్నివేశం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు అర్జున్ తనను దగ్గరగా కౌగిలించుకొని వీపును నిమిరాడని చెప్పారు. 50 మంది ముందు ఈ ఘటన జరిగిందని వివరించారు. తాను తీవ్ర ఇబ్బందికి గురయ్యానని, ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా రోజులు పట్టిందని పేర్కొన్నారు. అయితే ఆ విషయాన్ని అర్జున్ ఖండించారు. కోర్ట్ కు కూడా వెళ్లారు.