Bigg Boss: మరొకడితో బెడ్‌పై పడుకోలేను.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Tanushree Dutta

Tanushree Dutta: దేశంలో బిగ్‌ బాస్ షో ఎంత పాపులర్ అయిందో సంగతి తెలిసిందే. తొలుత హిందీలో ప్రారంభమైన ఈ షో.. మెల్లమెల్లగా ప్రాంతీయ భాషల్లోకి చొచ్చుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లోనూ బిగ్‌ బాస్ షో జరుగుతోంది. అయితే ఈ షోకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. అంతే మంది విమర్శకులు కూడా ఉన్నారు. ఈ షోలో బూతులు, అశ్లీలత, అసభ్యకర ప్రవర్తనలు తప్ప ఏం ఉండవని విమర్శిస్తూ ఉంటారు. ఈ షో వల్ల యువత చెడిపోతున్నారని దీనిని బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు కూడా ఊపందుకున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్‌ షోలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ షోపై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిందీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిన ‘మీటూ’ ఉద్యమంతో దేశవ్యాప్తంగా ఆమె వార్తల్లో నిలిచిన విషయం విధితమే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ షోపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదొక దారుణమైన షో అని విమర్శించారు. కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ షోలో పాల్గొనని తేల్చిచెప్పారు. గత 11 ఏళ్ల నుంచి బిగ్ బాస్ నిర్వాహకులు తనను సంప్రదిస్తూనే ఉన్నారని తెలిపారు. ఈసారి ఏకంగా రూ.1.65 కోట్లు ఆఫర్ చేశారని అయినా కూడా తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఆ షోలో అడుగుపెట్టనని స్పష్టం చేశారు. ఇందుకు గల కారణాలనూ వివరించారు.

ఆ రియాలిటీ షో వాతావరణం తనకు ఏమాత్రం నచ్చదన్నారు. షోలో పురుషులు, మహిళలు ఒకే బెడ్ షేర్ చేసుకుంటారని.. తనకు అలాంటివి నచ్చవన్నారు. ఎవరో తెలియని వ్యక్తితో తాను బెడ్ షేర్ చేసుకోలేనని తెలిపారు. తాను అంత చీప్ కాదన్నారు. అలాగే తనకుంటూ కొన్ని ఆహారపు అలవాట్లు ఉన్నాయని వాటిని మార్చుకోలేనని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనుశ్రీ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

కాగా తెలుగులో ఆమె నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరభద్ర’ సినిమా ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. అయితే ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అనంతరం బాలయ్యతోనే ‘అల్లరిపిడుగు’ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో తిరిగి బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ కొన్ని సినిమాలు చేసి విరామం తీసుకుంది. అనంతరం మీటూ ఉద్యమంతో పాపులర్ అయింది.