ఆ డౌట్ లోంచే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పుట్టింది

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో హల్‌చల్‌ చేస్తున్నారు. ఆ మధ్యన తిరుమల వేదికగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను ప్రారంభించిన వర్మ సినీ రాజకీయ రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో ఎన్టీఆర్ నిజజీవితంలో చోటుచేసుకున్న కీలక సంఘటనలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా గురించి మీడియాకు వరుస ఇంటర్య్వూలు ఇస్తూ సినిమాకు వీలైనంత ప్రచారం తీసుకొచ్చే పనిలో ఉన్నారు. తాజాగా తాను తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా గురించిన విశేషాలను ఓ మీడియాతో పంచుకున్నారు వర్మ.

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘‘ఆ రోజుల్లో ఎన్టీఆర్ అంటే పెద్ద స్టార్, చాలా పాపులారిటీ ఉన్న వ్యక్తి. అలాంటిది ఆయన జీవితంలోకి అత్యంత సాధారణమైన మహిళ లక్ష్మి పార్వతి ఎలా ఎంటరైంది.

పైగా ఆమె పెద్ద అందగత్తె కూడా కాదు. ఇదే నాకు చాలా పెద్ద ప్రశ్న అనిపించింది. ఈ ప్రశ్న లోంచి పుట్టిన పరిశోధనే మా ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమాలో పూర్తిగా ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితాన్ని చూపించనున్నాం’’ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా జనవరి 24న రిలీజ్‌ కానుంది.

మరో ప్రక్క దివంగత నేత ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఓ వైపు డైరెక్టర్ క్రిష్.. ఎన్టీఆర్ సినీ జీవితంలోని అంశాలను, రాజకీయ జీవితంలోని అంశాలను చూపటానికి రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందిస్తున్నారు.