థియేట‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్‌ వ్య‌వ‌స్థకు ఎండ్ కార్డ్!!

సినిమా రంగంపై రిల‌య‌న్స్ భూతం అణుబాంబ్!
మీ ఇంటికే సినిమా.. మొబైలే థియేట‌ర్.. స‌రికొత్త‌ డిజిట‌ల్ భూతం!!

డిజిటల్ రంగం అంత‌కంత‌కు విస్త‌రిస్తోంది. నెట్ ఫ్లిక్స్.. అమెజాన్.. ఈరోస్.. హాట్ స్టార్.. ఒక‌టేమిటి కార్పొరెట్ దిగ్గ‌జాల‌న్నీ ఆన్ లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ పేరుతో వినోద ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించి బంతాడేస్తున్నాయి. ఈ ప‌రిణామం టాలీవుడ్ స‌హా దేశంలోని అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు ఒక ర‌కంగా పొగ పెట్టేస్తోంద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. డిజిట‌ల్ స్ట్రీమింగ్ కంపెనీల వ‌ల్ల నిర్మాత‌కు మిగులుతున్నా డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు మాత్రం న‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. సినిమా రిలీజైన నెల‌రోజుల‌కే ఆన్ లైన్ లో సినిమా ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుండ‌డంతో పంపిణీదారులు ల‌బోదిబోమంటున్నారు.

అయితే ప్ర‌స్తుత స‌న్నివేశం చూస్తుంటే డిజిట‌ల్‌దే భ‌విష్య‌త్ అని అర్థ‌మ‌వుతోంది. మునుముందు థియేట‌ర్ల వ్య‌వ‌స్థ‌, డిస్ట్రిబ్యూట‌ర్ల వ్య‌వ‌స్థ అంత‌రించిపోయే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. డిజిట‌ల్ విస్త‌రించే కొద్దీ ఆ మేర‌కు సినిమాలు థియేట‌ర్ల వ‌ర‌కూ వ‌చ్చే ప‌రిస్థితి ఉండ‌దు. దానివ‌ల్ల తీవ్రంగా న‌ష్ట‌పోయేది థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌నే. అలాగే పంపిణీదారుల‌కు బిగ్ పంచ్ ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు. త‌ద్వారా ఆ రెండు రంగాల్లో ఉపాధి పొందేవాళ్లు ఇక క‌నిపించ‌ర‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. ఇప్ప‌టికే ఆ రెండు వ్య‌వ‌స్థ‌లు అంప‌శ‌య్య‌పై ఉన్నాయ‌ని.. స‌న్నివేశం అంత గొప్ప‌గా లేద‌న్న విశ్లేష‌ణ‌లు చేసేవాళ్లు ఉన్నారు.

మూలిగే న‌క్క‌పై తాటి పండు ప‌డ్డ చందంగా ఇప్పుడు రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ చేసిన ప్ర‌క‌ట‌న అప్పుడే పంపిణీదారులు, థియేట‌ర్ య‌జ‌మానుల్లో ఆందోళ‌న‌కు కార‌ణ‌మైంది. ఇక‌పై సినిమా రిలీజ్ రోజే నేరుగా రిల‌య‌న్స్ మొబైల్స్ లో మీరు కొత్త సినిమాలు ఇంట్లోనే ఉండి చూసుకోవ‌చ్చు!! అంటూ చాలా క్లారిటీగా ప్ర‌క‌టించారు అంబానీ. రిల‌య‌న్స్ జియో ఏజీఎం 2019 కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఆ ప్ర‌క‌ట‌న చేయ‌గానే ఒక్క‌సారిగా సినిమా లోకం విస్తుపోయింది. ఇక‌పై కొత్త‌గా రిలీజ్ కి రానున్న సినిమాల్ని కొనేసి నేరుగా ఆయ‌న రిల‌య‌న్స్ మొబైల్స్ లోనే రిలీజ్ చేసేస్తారు. త‌ద్వారా ఆయ‌న వినోద‌రంగంపై అణుబాంబ్ వేయ‌బోతున్నార‌న్న‌మాట‌. వచ్చే ఏడాది ద్వితీయార్థం నుంచి తమ సర్వీస్ ద్వారా కొత్త సినిమాలు నేరుగా మొదటి రోజు మొదటి ఆట ఇంట్లోనే చూడొచ్చని అంబానీ ప్ర‌క‌టించారు కాబ‌ట్టి దానికి నిర‌స‌న‌గా ఇప్ప‌టినుంచే మ‌నోళ్లు ఎలాంటి ఆయుధాలు రెడీ చేయ‌బోతున్నారో చూడాలి. ఇంత‌కుముందు ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌రూపం చిత్రాన్ని డిజిట‌ల్‌లో రిలీజ్ చేస్తాన‌ని నేరుగా ఇంట్లోనే చూసుకోమ‌ని ప్ర‌క‌టించిన‌ప్పుడు పంపిణీదారులంతా వ్య‌తిరేకించారు. ఒక్క‌డు కాబ‌ట్టి ఆప‌గ‌లిగారు. ఇప్పుడు వ్య‌వ‌స్థ‌ను ట‌చ్ చేయాల్సి ఉంటుంది. ముఖేష్ అంబానీ అనే అతి పెద్ద భూతాన్ని ఎదిరించాల్సి ఉంటుంది. రిల‌య‌న్స్ విసిరే అణుబాంబ్ ని ఏ మేర‌కు ఎదుర్కొంటారో చూడాలి.