కరోనా మహమ్మారి వలన సినీ పరిశ్రమ ఎంతగా కుదేలైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 8 నెలల పాటు షూటింగ్స్ బంద్ కావడంతో సినీ కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. సినిమాలు లేకపోవడం, థియేటర్లలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందనే భావనతో ఇప్పటికీ థియేటర్స్ మూతబడే ఉన్నాయి. రానున్న రోజులలో థియేటర్స్ మనుగడ కష్టమని భావించిన యాజమాన్యాలు వాటిని గోడౌన్‌లుగా మార్చేందుకు సిద్దమవుతున్నారు.
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ సీటు సీటుకి మధ్య గ్యాప్ ఉంచి థియేటర్స్ రన్ చేయాలని ప్రభుత్వాలు చెబుతుంటే, అలా నడిపిస్తే తీరని నష్టం చేకూరుతుందని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితులని అర్దం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ రంగానికి చేయూతగా నిలవాలని నిర్ణయించుకుంది. తాజాగా జరిగిన కేబినేట్ భేటిలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయాలని, మిగిలిన ఆరు నెలలు ఫిక్స్‌డ్‌ఛార్జీలు చెల్లింపును వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా వర్కింగ్ క్యాపిటల్ రుణాలు ఇవ్వనున్నట్టు తెలియజేసిన ప్రభుత్వం ఏ, బి సెంటర్లలో థియేటర్లకు 10 లక్షల చొప్పున, సి సెంటర్లలోని థియేటర్లకు రూ. 5లక్షల చొప్పున రుణాలు ఇస్తామని అన్నారు. వాయిదా చెల్లింపులపై 6 నెలల మారటోరియం విధించి తర్వాతి సంవత్సరం నుండి వడ్డీలో నాలుగున్నర శాతాన్ని ప్రభుత్వమే భరిస్తుందంటూ ప్రకటించారు. దీని వలన 1100 థియేటర్స్ కు లబ్ది చేకూరుతుందని అంటున్నారు. ఇవి థియేటర్స్ యాజమాన్యాలకు తప్పక వెసులుబాటుని ఇస్తాయి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై చిరంజీవితో పాటు పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.