కరోనా వలన దాదాపు తొమ్మిది నెలలుగా థియేటర్స్ అన్నీ మూతపడే ఉన్నాయి. ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీతో తెరచుకోవచ్చు అని చెప్పిప్పటికీ, భారాన్ని మోయలేక యాజమాన్యాలు సైలెంట్‌గానే ఉన్నాయి. డిసెంబర్ లో అంతటా థియేటర్స్ తెరుస్తారనే టాక్స్ వినిపిస్తుండగా, సినీ ప్రేక్షకులలో కాస్త జోష్ వచ్చింది. అయితే కరోనా వలన సినీ ప్రేమికులు ఓటీటీకి బాగా కనెక్ట్ కావడంతో థియేటర్స్ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు. పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో విడుదలైతే బాగుండు అని అనుకుంటున్నారు.
థియేటర్స్ ఓపెన్ చేసిన ప్రేక్షకులు వస్తారో రారో అనే మీమాంసతో ఉన్న కొందరు నిర్మాతలు తమ సినిమాలని ఓటీటీలో విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో బాగంగానే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా ఓటీటీలో విడుదల కానుందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా 120 కోట్లకు పైగా డీల్ సెట్ చేసుకుందని , అక్కడే ఈ సినిమాను స్ట్రీమ్ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా ప్రకటన విడుదల చేసింది.
కరోనా వలన అందరం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రస్తుతం పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. మాస్టర్ చిత్రాన్ని థియేటర్‌లోనే విడుదల చేస్తున్నాం. ఓటీటీలో విడుదల అవుతుందని వస్తున్న వార్తలు అవాస్తవం. ఓటీటీ సంస్థ నుండి భారీ ఆఫర్ వచ్చినప్పటికీ థియేటర్‌లోనే విడుదల చేయాలని మేం భావించాం. ఈ చిత్రాన్నిథియేటర్స్‌లోనే విడుదల చేస్తున్నాం. ఎప్పుడు ఏంటనేది త్వరలో చెబుతాం. ఆ గుడ్ న్యూస్ కోసం ఎదురు చూడండి. థియేటర్ యాజమాన్యాలు కూడా మాకు సపోర్ట్‌గా ఉండాలని కోరుతున్నాం అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. మరి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.