ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి వలన ఎందరో జీవితాలు దుర్భరంగా మారాయి. చాలా మంది తమ జీవనాధారాలను కోల్పోయారు. కొందరు నటులు పూట గడవడం కోసం రోడ్డెక్కి కూరగాయలు అమ్ముకోవడం లేదంటే టిఫన్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవడం వంటివి చేశారు. ఈ కరోనాతో సినీ పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొందనే చెప్పాలి. షూటింగ్స్ బంద్ కావడం, థియేటర్స్ మూతపడడంతో చాలా మందికి వినోదం అనేదే కరువై పోయింది. అయితే ఇటీవల ప్రభుత్వం థియేటర్స్ తెరచుకోవచ్చని ప్రకటించినప్పటికీ యాజమాన్యాలు మాత్రం డైలమాలోనే ఉన్నాయి.
50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ రన్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు ప్రతి షోకు తప్పని సరిగి శానిటైజ్ చేయాలని అనడంతో ఈ ఏర్పాట్లు చేయడం తలకు మించిన భారంగా మారుతుందా అని యాజమాన్యాలు డైలమాలో పడ్డాయి. డిసెంబర్ 4 నుండి కొన్ని థియేటర్స్ తెరుచుకుంటున్నట్టు టాక్స్ వినిపిస్తుండగా, హైదరాబాద్‌లో ఉన్న కొన్ని పాత థియేటర్స్ శాశ్వతంగా మూతపడనున్నాయి అనే టాక్ వినిపిస్తుంది. సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ వలన ఇప్పుడు ఒరిగేది ఏమి లేదని యాజమాన్యాలు భావించి వాటి ప్లేస్‌లో వేరే బిజినెస్‌లు చేయాలని అనుకుంటున్నారట .
ప్రస్తుతానికి ఐదు థియేటర్స్ మూత పడ్డాయనే టాక్ వినిపిస్తుండగా, వాటిలో నారాయణగుడలోని శాంతి థియేటర్, టోలీచౌకీలోని గెలాక్సీ థియేటర్, బహదూర్ పురాలోని శ్రీరామ థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీమయూరీ థియేటర్, మెహిదీపట్నంలోని అంబా థియేటర్ శాశ్వతంగా మూతబడినట్టు తెలుస్తోంది. వీటిలో కొన్నిటిని గొడౌన్లుగాను, ఇంకొన్నిటిని ఇతర వ్యాపార అవసరాల కోసం వినియోగించనున్నారట. మాస్ ప్రేక్షకులకి ఎంతో దగ్గరైన ఈ థియేటర్స్ మూతపడడం సిని ప్రేమికులని ఎంతో ఆందోళన కలిగిస్తుంది.