కరోనా వలన పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. సినిమా షూటింగ్స్ దాదాపు ఏడు నెలలు ఆగిపోయాయి. థియేటర్స్ తొమ్మిది నెలలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అనుకూలిస్తున్న నేపథ్యంలో అన్ని పనులు సజావుగా సాగుతున్నాయి. అయితే గత కొన్ని రోజుల వరకు కూడా కేవలం 50 శాతం సీటింగ్ తోనే థియేటర్స్ ఓపెన్ చెయ్యడానికి అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 100 శాతంకి అనుమతి కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం వందశాతం అనుమతి ఇచ్చినప్పటికీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం 100 శాతం సీటింగ్ కు అనుమతులు జారీ చేసింది. దీంతో సినిమా థియేటర్లలో పూర్తిస్థాయిలో టికెట్లను అమ్ముకోవడానికి యజమానులకు అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సినీ ప్రేమికులతో పాటు థియేటర్ యాజమాన్యాలు, ఇండస్ట్రీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
కరోనా వలన మూతపడ్డ థియేటర్స్‌కు గతేడాది అక్టోబర్‌లోనే తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినా.. ఇప్పటి వరకు కేవలం 50 శాతం కెపాసిటీతోనే నడపడానికి అనుమతి ఉండేది. దీంతో యాజమాన్యాలు తమ బాధలను ప్రభుత్వాలకి తెలియజేశారు. 50 శాతం సీటింగ్‌తో నడపడం కష్టంగా ఉందని పేర్కొనడంతో వారి బాధలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం గుడ్ న్యూస్ అందించింది.