తెలంగాణ మిర్యాలగూడకు చెందిన దళిత వర్గానికి చెందిన ప్రణయ్ మర్డర్ రాష్ర్ట వ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. అగ్రకులానికి చెందిన వ్యాపారవేత్త మారుతిరావు కుమార్తె అమృత-ప్రణయ్ ప్రేమించుకోవడం..పెళ్లి చేసుకోవడం నేపథ్యంలో మారుతిరావు కిరాయి గుండాలతో ప్రణయ్ ని మట్టుబెట్టించాడు. ఆ సమయంలో అమృత నిండు గర్భిణి. సరిగ్గా ఆసుపత్రి ముందే ప్రణయ్ ని మారుతిరావు గుండాలు కత్తితో నరికి చంపారు. అటుపై మారుతిరావు జైలుకెళ్లడం…అమృత ప్రణయ్ కుటుంబంతోనే కలిసి ఉండటం జరిగింది. ఆ తర్వాత మరుతిరావు బెయిల్ మీద బయటకు రావడం హైదరాబాద్ లోని ఓ ఆర్యవైశ్య భవనం లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ కథంతా ఓ సినిమాని తలపిస్తుంది.
పెళ్లికి ముందు అమృత-ప్రణయ్ లవ్ స్టోరీ? మారుతిరావు ప్రణయ్ ని హెచ్చరించడం.. అతను మారుతిరావుని పట్టించుకోక పోవడం వంటి సన్నివేశాలు సినిమా స్ర్కిప్ట్ నే తలపిస్తాయి. ఇప్పుడిదే కథతో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫాదర్స్ డే సందర్భంగా సినిమా చేస్తున్నట్లు సైలెంట్ గా పోస్టర్ వేసి మరీ ప్రకటించాడు. మర్డర్ టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కుటుంబ కథా చిత్రమ్ అనేది ఉపశీర్షిక. రామ్ గోపాల్ వర్మ సారథ్యంలో ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. నట్టికరుణ, క్రాంతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో వర్మ రిలీజ్ చేసిన పోస్టర్ పై అమృత వ్యంగ్యంగా స్పందించింది.
పోస్టర్ చూసిన వెంటనే ఆత్మ హత్య చేసుకోవాలనిపించిదట అమృతకి. ఇప్పటికే జీవితం తల్లకిందులైందని, ప్రణయ్, ప్రాణంగా ప్రేమించిన తండ్రిని దూరం చేసుకున్నానని వాపోయారు. ప్రణయ్ పోయిన తర్వాత సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కుంటు న్నానని, తన క్యారెక్టర్ గురించి ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడింది. ఆత్మ గౌరవంతో బ్రతుకుతున్నాను. ఇప్పుడు వర్మ రూపంలో మరో కొత్త సమస్య వచ్చి పడిందన్నారు. దీన్ని ఎదుర్కునే శక్తి లేదన్నారు. ఏడుద్దామన్నా కన్నీళ్లు ఇంకిపోయాయి అన్నారు. జీవితాన్ని బజారులోకి లాగొద్దన్నారు. వర్మ తమ జీవితాలతో సొమ్ము చేసుకుంటున్నాడని ఆరోపించారు. అమృత జీవితానికి-ఈ కథకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అయినా వర్మపై పోలీసు కేసు పెట్టనన్నారు. మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి వర్మ లేకపోవడం చూస్తుంటే జాలేస్తుందన్నారు అమృత.